ముంబై, సెప్టెంబర్ 11: విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఈ నెల తొలివారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు చారిత్రక గరిష్ఠ స్థాయి 785.706 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంతో పోలిస్తే 44.903 బిలియన్ డాలర్లు అధికమైనట్టు వెల్లడించింది. అంతక్రితం వారంలో రిజర్వులు 11.475 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. దేశీయ కరెన్సీ విలువ రూపాయి ఒత్తిడికి గురికావడం, డాలర్ అమ్మకాలు అధికంగా ఉండటంతో వీటిని నియంత్రించడానికి రిజర్వుబ్యాంక్ జోక్యం చేసుకున్నది. దీనికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రారంభమైన నాటి నుంచి తగ్గుతూ వచ్చిన రిజర్వులు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ నెల 4తో ముగిసిన వారాంతానికిగాను విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 47.498 బిలియన్ డాలర్లు అధికమై 648.168 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
తగ్గిన గోల్డ్ రిజర్వులు
గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన బంగారం రిజర్వులు తగ్గుముఖం పట్టాయి. గత వారాంతానికిగాను గోల్డ్ రిజర్వులు 2.594 బిలియన్ డాలర్లు తరిగిపోయి 113.816 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని పేర్కొంది.