న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : అమెరికా నౌకాదళానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి, వాటి కదలికలను పర్యవేక్షించడానికి, సైనిక దాడులు లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగపడే సమాచారాన్ని రూపొందించడానికి ఇరాన్ అనుబంధ సంస్థ ఒకటి ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ అనే కృత్రిమ మేధ(ఏఐ) మోడల్‌ను ఉపయోగించిందని ఆ సంస్థ వెల్లడించిన తాజా నివేదిక పేర్కొంది. ఇరాన్, యెమెన్, చైనా, రష్యాలో తమ ఏఐ మోడల్‌ను నిఘా సమాచార సేకరణ, ఆయుధాల అభివృద్ధి, సేకరణ వంటి కార్యకలాపాల కోసం వినియోగించిన ఆరు కార్యకలాపాలను గుర్తించి, వాటిని అడ్డుకున్నట్టు ఆంత్రోపిక్ తెలిపింది.
ఆ ప్రాంతంలోని అమెరికా నౌకాదళ ఆస్తులకు సంబంధించిన బహిరంగ సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడానికి ఇరాన్‌తో సంబంధం ఉన్న ఒక వ్యవహారంలో నిర్వాహకులు క్లాడ్‌ను ఉపయోగించారు. అనంతరం నౌకాదళ స్థానాలను గుర్తించడం, వాటి కదలికలను పర్యవేక్షించడంలో సహాయపడే సమాచారంతో కూడిన టార్గెటింగ్ హ్యాండ్‌బుక్స్ రూపొందించారు.