న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: బంగారం కొండదిగుతున్నది. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు అంతే వేగంతో కిందికి పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా తగ్గుముఖం పట్టడం విశేషం. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.2,700 తగ్గి రూ.1.56 లక్షల దిగువకు పడిపోయింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.1,55,900 వద్ద స్థిరపడింది. అంతకుముందు గోల్డ్ ధర రూ.1,58,600గా ఉన్నది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధరలు పెరిగినప్పటికీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని, వరుసగా మూడోవారం కూడా ధరలు తగ్గుముఖం పట్టాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
ఇంధన ధరలు భగ్గుమంటుండటం, దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలుండటంతో వడ్డీరేట్లు అధికమయ్యే సూచనలు కూడా పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసిందన్నారు. దీంతో తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల నుంచి ఈక్విటీలు, డెరివేటివ్లకు మళ్లించడంతో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా పడిపోయాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.10 వేలు తగ్గి రూ.2,34,600గా ఉన్నది. గురువారం ఈ ధర రూ.2,44,600గా నమోదైంది. ఇటీవల కాలంలో భారీగా పుంజుకున్న బంగారం ధరలు కరెక్షన్కు గురయ్యాయని, వీటికి తోడు స్థానిక మార్కెట్లో అమ్మకాల ఒత్తిడికి గురికావడం కూడా ధరలు భారీగా పడిపోవడానికి ప్రధాన కారణమని ట్రేడర్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 49.82 డాలర్లు లేదా 1.15 శాతం బలపడి 4,366.58 వద్దకు చేరుకోగా, వెండి రెండు శాతం అధికమై 64.77 డాలర్లకు ఎగబాకింది.