ముంబై, నవంబర్ 14 : విదేశీ నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ నెల 7తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.699 బిలియన్ డాలర్లు తరిగిపోయి 687. 034 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వుబ్యాంక్ తాజా సమీక్షలో వెల్లడించింది. అంతక్రితంవారంలోనూ రిజర్వులు 5.623 బిలియన్ డాలర్లు తగ్గి 689.733 బిలియన్ డాలర్లకు చేరాయి.
గతవారాంతానికిగాను విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ తరిగిపోవడం వల్లనే మొత్తం నిల్వలు తగ్గాయని పేర్కొంది. 2.454 బిలియన్ డాలర్లు తగ్గి 562.137 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే పసిడి రిజర్వులు 195 మిలియన్ డాలర్లు తగ్గి 101.531 బిలియన్ డాలర్లకు పరిమితమవగా, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 51 మిలియన్ డాలర్లు తగ్గి 18. 594 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.