న్యూఢిల్లీ, నవంబర్ 14 : అన్ని దవాఖానలు, బీమా సంస్థలు వైద్య ప్రమాణాలను మెరుగుపర్చాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. దేశంలోని ప్రముఖ దవాఖానలు, ప్రధాన బీమా సంస్థల ప్రతినిధులతోపాటు, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్, భారతీయ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ అసోసియేషన్‌తో ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు అధ్యక్షతన గురువారం ఓ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య క్లెయిమ్‌ల ఎక్సేంజ్‌ను వేగవంతం చేయడం, నగదురహిత క్లెయిమ్‌ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడటంతోపాటు, కామన్ ఎంపానెల్మెంట్ నిబంధనల్ని పాటిస్తూ ప్రామాణిక వైద్యచికిత్స ప్రోటోకాల్స్‌ను రూపొందించాలని ఆయా రిప్రజెంటేటివ్‌లకు నాగరాజు సూచించినట్టు శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
వైద్య రంగంలో పెరుగుతున్న ఖర్చులు, ప్రీమియం ధరలపైనా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆరోగ్య సంరక్షణ సేవలు అందరికీ అందుబాటు ధరల్లో లభించేందుకు కృషి చేయాలని ఫైనాన్స్ మినిస్ట్రీ కోరింది. ఆరోగ్య బీమా పాలసీదారులకు పారదర్శక, ప్రభావవంతమైన సేవలు అందించాలని బీమా సంస్థలకు నాగరాజు సూచించారు. దవాఖానలు, బీమా సంస్థలు పరస్పర సహకారంతో పనిచేయాలని కూడా కోరారు.