అసలెవ్వరికీ భయపడని గుండెలు తీసిన మొనగాడైనా గజగజా వణుకుతాడు. నాకేంటి ఎదురనే కండలు తిరిగిన పహల్వాన్ అయినా బయటికి రావాలంటేనే భయపడతాడు. మనకసలు టైమింగ్సేంటీ అని ధిలాసాగా రోడ్ల మీద తిరిగే జెన్‌జీ బ్యాచ్కూడా లోపలికి తుర్రుమంటుంది… ఇంతకీ అంత తోపు ఎవరా అనుకుంటున్నారా… ఇంకెవరు చలికాలమే! ఇది వచ్చిందంటే ఎంతటివారైనా అమ్మో తుమ్ము అంటూ ఆమడ దూరం పరిగెత్తాల్సిందే. దానివెంట వచ్చే దగ్గును చూసి… అడుగు తీసి బయటపెట్టేందుకు ఆలోచించాల్సిందే! ఎంత ముసుగేసుకొచ్చినా కనిపెట్టి పట్టేసే చలిపులినీ, దాని వెంట జంటగా వచ్చే జలుబు, దగ్గుల్ని ఎదిరించేందుకు ఒక మంచి ఆయుధం ఉంది. అదే వేడి వేడి సూప్. సుర్ర్… మంటూ ఈ సూప్ తాగితే తుర్ర్… మంటూ జలుబు, దగ్గు పరారవ్వాల్సిందే!

జలుబుకు మందేంటీ? అని అమ్మమ్మను అడిగితే అల్లం కషాయమే అని చెబుతుంది. మిరియాలకు తిరుగే లేదంటుంది. ఇక వీటికి తోడుగా కాసిన్ని క్యారెట్లు, ఓ వెల్లుల్లి రెబ్బ జోడించి కొత్తిమీర చిలకరించి గంజికాచి పొట్టలో పోశామంటే… ఇంకెక్కడి సర్ది… అప్పటికప్పుడే దుకాణం సర్దుకుంటుంది. క్యారెట్లలో ఉండే విటమిన్-ఎ, సి, బి6లు మంచి రోగనిరోధక వ్యవస్థను తయారు చేస్తే, మిగతా దినుసులకు యాంటి వైరల్, యాంటి బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి మరి.
కావలసిన పదార్థాలు
క్యారెట్: నాలుగైదు
అల్లం: రెండు అంగుళాల ముక్క
వెల్లుల్లి: పది రెబ్బలు
ఉల్లిగడ్డ: రెండు
మిరియాల పొడి: పావు స్పూను
ఆలివ్ ఆయిల్: రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
క్యారెట్‌ను కడిగి కాస్త పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. అల్లాన్ని సన్నగా, ఉల్లిపాయల్ని పొడవాటి సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లి పాయల్ని ఒలిచి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా మందపాటి పాన్‌ను పొయ్యి మీద పెట్టుకుని అందులో ఆలివ్ ఆయిల్‌ను వేయాలి. కాస్త కాగాక తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసి కాసేపు కలియతిప్పాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని కూడా వేసి రెండు నిమిషాలు కలియబెట్టాలి. తర్వాత రెండు మూడు కప్పుల నీళ్లు పోసి ప్రెజర్ కుక్కర్లో ఉడికించాలి. దాన్ని వడకట్టి, నీళ్లు పక్కకు పెట్టి ఉడికిన ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి ఈ పేస్ట్‌ను వేసి ఇందాక ఒంపి పెట్టుకున్న నీళ్లను కలిపి ఉప్పు, మిరియాల పొడి చల్లి కావలసినంత చిక్కదనం వచ్చే వరకూ కలుపుకొని దింపేయాలి. దాని మీద సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుంటే, నోటిలో వేడిగా గొంతులో హాయిగా ఉండేలా లాగించేయడమే!

కాస్త పొట్ట నిండుగా ఉండాలి, తీసుకునేది గొంతులోకి సులభంగా జారాలి అనుకుంటే ఈ టిబెటన్ వెరైటీని ప్రయత్నించవచ్చు. ఇందులో రకరకాల కూరగాయల ముక్కలు, నూడుల్స్ ఉంటాయి. దాల్చిన చెక్క, మిరియాలు, అల్లంలాంటివన్నీ ఒంట్లో వేడిని పుట్టించి జలుబు దగ్గులతో పోరాడుతాయి. కూరగాయల ముక్కలు శరీరానికి సత్తువనిస్తాయి. గొంతుకు ఇబ్బందిగా ఉంటుందనిపిస్తే ఈ సూప్‌లో సాస్‌లు పరిహరిస్తే సరి!
కావలసిన పదార్థాలు
నూడుల్స్: చిన్న కప్పు
క్యాబేజీ: మోస్తరు ముక్క
క్యారెట్: రెండు
బీన్స్: అర్ధపావు
ఉల్లికాడలు: పది పన్నెండు
వెజిటబుల్ బ్రాత్: నాలుగు కప్పులు
స్వీట్ చిల్లీసాస్, సోయాసాస్: రెండు టీస్పూన్లు
చిల్లీ సాస్: అరస్పూను
మిరియాల పొడి: చిటికెడు
గరం మసాలా: చిటికెడు
వెల్లుల్లి: నాలుగు రెబ్బలు
అల్లం: అంగుళం ముక్క
దాల్చిన చెక్క పొడి: చిటికెడు
ఉల్లిగడ్డ: ఒకటి
ఉప్పు: రుచికి తగినంత
నూనె: ఒక టీ స్పూను
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
తయారీ విధానం
కూరగాయలన్నింటినీ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. నూడుల్స్‌ని నీళ్లలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యిమీద మందపాటి గిన్నెపెట్టి నూనె వేసి తరిగిన అల్లం, ఉల్లిపాయల్ని వేసి వేయించుకోవాలి. తర్వాత మిగిలిన ముక్కలన్నింటినీ వేసి కాస్త ఉప్పు చల్లి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు గరం మసాలా, మిరియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, సాస్‌లు వేసి వెజిటబుల్ బ్రాత్ (రకరకాల కూరగాయ ముక్కల్ని ఉడికించిన నీరు) కూడా పోసి5 నిమిషాలు మరిగించాలి. కొత్తిమీర వేసి మరో అయిదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న నూడుల్స్, దాల్చిన చెక్క పొడి వేసి రెండు నిమిషాలు ఉంచితే థుప్పా సూప్ రెడీ!

టమాటా పెప్పర్ కార్న్ క్లియర్ సూప్! టమాటా ఫ్లేవర్‌ను ఇష్టపడేవారు దీన్ని చేసుకోవచ్చు. ఇందులో ఉండే మిరియాలు పురాతన కాలం నుంచీ జలుబు, దగ్గులాంటివాటి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. గొంతు గరగరను, శ్లేష్మాన్ని తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. టమాటాల్లో ఉండే విటమిన్ సి, లైకోపీన్‌లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. క్లియర్ సూప్ కాబట్టి చిక్కగా కాకుండా పల్చగా ఉండి, పొట్టలో సులభంగా జీర్ణమవుతుంది.
కావలసిన పదార్థాలు
టమాటాలు: పెద్దవి రెండు
మిరియాలు: సుమారు 10
వెల్లుల్లి: నాలుగు రెబ్బలు
అల్లం: అంగుళం ముక్క
దాల్చిన చెక్క: ఒక ముక్క
ఉల్లిగడ్డ: చిన్నది ఒకటి
ఉప్పు: రుచికి తగినంత
నూనె: ఒక టీ స్పూను
పుదీనా ఆకులు: అయిదారు
తయారీ విధానం
ముందుగా మిరియాలను పొడి చేసి పెట్టుకోవాలి. టమాటాలు కాస్త పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి. పొయ్యి మీద పావు లీటరు నీళ్లు పెట్టి అందులో టమాటా, అల్లం, దాల్చిన చెక్క, మిరియాల పొడి వేసి బాగా మరగనివ్వాలి. టమాటాలు బాగా మెత్తగా అయ్యాక వాటిని మెదిపి ఈ నీళ్లను వడగట్టి పక్కకు పెట్టుకోవాలి. పొయ్యిమీద మరో పాన్ పెట్టి నూనె వేసి వెల్లుల్లి, ఉల్లిపాయల్ని బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందాక ఒంపి పెట్టుకున్న నీళ్లను ఇందులో పోసి ఉప్పు వేసి కాసేపు మరగనివ్వాలి. దించేసి కొద్దిగా మిరియాల పొడి, నాలుగు పుదీనా ఆకులు చల్లి వేడివేడిగా వడ్డించడమే!

రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు గొంతులో ఏ కాస్త నసగా ఉన్నా హాట్ అండ్ సోర్ సూప్నే ఆలోచించకుండా ఆర్డరిచ్చేస్తాం. అల్లం వెల్లుల్లి ఘాటుతో పాటు సన్నగా తరిగిన కూరగాయల ఫ్లేవర్‌తో… జలుబు చేసినప్పుడు గొంతుకు హాయినిచ్చే ఆప్షన్లా కనిపిస్తుంది. మిరియాల తోడుగా వేడివేడిగా పొట్టలోకి జారే ఈ సూప్… ఏమీ తినబుద్ధి కానప్పుడు శరీరానికి సత్తువనిచ్చే ఆహారం.
కావలసిన పదార్థాలు
క్యాబేజీ: చిన్న ముక్క
క్యారెట్: ఒకటి
క్యాప్సికం: చిన్నది ఒకటి
బీన్స్: అయిదు
ఉల్లికాడలు: రెండు
పచ్చిమిర్చి: ఒకటి
కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు
సోయాసాస్: రెండు టీస్పూన్లు
చిల్లీ సాస్: ఒక టీస్పూను
వెనిగర్: రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి: అర టీస్పూను
పంచదార: సగం స్పూను
వెల్లుల్లి: మూడు రెబ్బలు
అల్లం: అంగుళం ముక్క
ఉప్పు: రుచికి తగినంత
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
మొదట కూరగాయలన్నింటినీ కడిగి బాగా సన్నటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చిలను కూడా అలాగే చేయాలి. తర్వాత పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేయాలి. కాగాక అందులో ముందుగా అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి రెండు నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత ఉల్లి కాడలు వేసి బాగా కలియదిప్పాలి. అవి కాస్త వేగిన తర్వాత క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం, బీన్స్ ముక్కల్ని కూడా వేయాలి. తర్వాత నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో సోయాసాస్, చిల్లీ సాస్, వెనిగర్, మిరియాల పొడి, ఉప్పు, పంచదారలను వేసి బాగా కలపాలి. ఒక చిన్న కప్పులోకి కార్న్‌ఫ్లోర్ వేసుకుని పావు కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని గిన్నెలోపోసి సూప్‌కి సరిపడా చిక్కదనం వచ్చేదాకా మరిగించి దింపే ముందు నాలుగు ఉల్లికాడలు చల్లుకుంటే… హాట్ హాట్‌గా హాట్ అండ్ సోర్ సూప్ సిద్ధమైపోతుంది.