పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వాలా వద్దా అనే భయం మీకు ఉందా? పోర్న్ కంటెంట్‌ను, నగ్న చిత్రాలను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఫోన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ సురక్షితమైన ఆన్లైన్ ప్రపంచాన్ని సృష్టించగలదా? పిల్లలకు సురక్షితమైన ఆన్లైన్ ప్రపంచం సాధ్యమేనా?
ఫిన్లాండ్కు చెందిన హ్యూమన్ మొబైల్ డివైజెస్ (HMD) కంపెనీ పిల్లల కోసం ‘Fuse’ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ హ్యాండ్సెట్ నగ్న చిత్రాలు కనిపించకుండా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. ఫోన్‌తో న్యూడ్ పిక్స్ తీయకుండా ఆపుతుంది. Fuse హ్యాండ్సెట్ పేరెంట్ కంట్రోల్స్‌తో పని చేస్తుంది. లొకేషన్ ట్రాకింగ్, స్క్రీన్ టైమ్ లిమిట్స్, యాప్స్‌ను బ్లాక్ చేయడం, నమ్మకమైన కాంటాక్టులను మాత్రమే అనుమతించడం లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. HMD చెప్పిన దాని ప్రకారం, ఈ ఫోన్ మొదట్లో బేసిక్ ఫోన్లా పనిచేస్తుంది. దీనికి సోషల్ మీడియా, యాప్ స్టోర్ యాక్సెస్ ఉండదు. పిల్లలు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారని తల్లిదండ్రులు భావించినప్పుడు.. తమ సొంత డివైజ్ ద్వారా యాక్సెస్ ఇవ్వవచ్చు. పిల్లల ఫోన్ నిత్యం మానిటర్ చేస్తూ, మేనేజ్ చేయవచ్చు.
ఇందులో పొందుపరిచిన HarmBlock AI టెక్నాలజీ పిల్లల్ని లైన్ దాటకుండా అడ్డుకుంటుంది. టెక్నాలజీ కంటెంట్‌ను రియల్ టైమ్‌లో స్కాన్ చేస్తుంది. పోర్నోగ్రఫీని వెంటనే బ్లాక్ చేస్తుంది. నగ్నత్వం ఉన్న ఫైళ్లను డిలీట్ చేస్తుంది. కెమెరా నగ్న చిత్రాలు తీయకుండా ఆపుతుంది. ‘మేము సురక్షితమైన ఫోన్‌ను తయారుచేయడంలో ఇదొక పెద్ద ముందడుగు అని నమ్ముతున్నాం. ఇది కేవలం ఫోన్ కాదు, సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చే కొత్త కేటగిరీ’ అని తయారీదారులు చెబుతున్నారు. ఆన్లైన్ వేధింపులు, మొబైల్ దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. దీన్ని ఆపగల ఏకైక శక్తి ఏఐనే. HarmBlock AI ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేయగలదు. ఏ యాప్, కెమెరా, వెబ్సైట్, మెసేజ్లోనైనా ఇది రక్షణ కల్పిస్తుంది. యూజర్ డేటా (ఫొటోలు, బ్రౌజింగ్ హిస్టరీ) సేకరించదని ఈ సంస్థ స్పష్టం చేసింది.