Police | వినాయక్ నగర్, మే 1 : విధి నిర్వహణలో అవినీతికి పాల్పడడంతో పాటు అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఓ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ రూరల్ సర్కిల్ పరిధిలో గల ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ను పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ ఫరిదిలో గజానంద్ జాదవ్ జిల్లా కోర్టు పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు. సదరు సీపీ కోర్టు లో వివిధ నేరాలకు సంబంధించిన క్రైమ్ తాత్కాలిక ప్రాపర్టి రిలీజ్ కేసులలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు వివిధ కేసులలో అవినీతికి పాల్పడుతున్నట్టు 6 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా కానిస్టేబుల్ గజానంద్ జాదవ్ పలు ప్రయివేటు చీటీల యాజమాన్యం సహకారంతో కలిసి 4 నుండి 5 చీటీలు వేసి తన తోటి సిబ్బందిని, మిత్రులను గ్యారంటీరులుగా పెట్టి అట్టి చిట్టీలకు సంబంధించిన మొత్తం డబ్బులను తీసుకొని తిరిగి డబ్బులు కట్టకుండా ఉండడమే కాకుండా, గ్యారెంటీగా ఉన్న వారు మాత్రమే డబ్బులు కట్టే విధంగా జాగ్రత్త పడినట్లు విచారణలో తేలింది.
దీంతో తమను మధ్యవర్తులుగా ఉంచి మోసం చేశాడని స్నేహితులు, తోటి సిబ్బంది సదరు కానిస్టేబుల్ పై నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ పోలీస్ స్టేషన్లో సైతం కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంతమందిని మోసం చేసిన కానిస్టేబుల్ గజానంద్ యాదవ్ అవినీతి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య దృష్టికి రావడం తో విచారణ చేపట్టి క్రమ శిక్షణ చర్యలలో భాగంగా ఆ కానిస్టేబుల్ ను నస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీచేశారు.