జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 4: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినులు బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ చదువుతున్న విద్యార్థినులు బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షకు వెళ్లాల్సి ఉన్నది. విద్యార్థినులు ఉదయం అల్పాహారంగా పెట్టిన పులిహోర తిని పరీక్ష రాయడానికి వెళ్లారు.
వారి వెంట వెళ్లిన టీచర్లు ఆర్మూర్‌లో మరోసారి టిఫిన్ చేయించారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రానికి వెళ్తున్న సమయంలో 8 మంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని హుటాహుటిన ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం పూజ అనే విద్యార్థినిని నిజామాబాద్‌కు తీసుకెళ్లారు.
విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయాన్ని సిబ్బంది తొలుత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. పిల్లలను దవాఖానకు తీసుకెళ్లగా, తల్లిదండ్రులను రప్పించాలని అక్కడి వైద్యులు చెప్పడంతో చివరకు సమాచారమిచ్చారు. హుటాహుటిన దవాఖానకు వచ్చిన తల్లిదండ్రులు టీచర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని నిలదీశారు. ఈ క్రమంలో టీచర్లు తమపై దురుసుగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఆరోపించారు.
విద్యార్థినుల అస్వస్థత విషయమై కేజీబీవీ ఎస్వో స్వప్నను వివరణ కోరగా, తాను అందుబాటులో లేనని చెప్పారు. హైదరాబాద్‌లో అత్యవసర సమావేశం ఉండటంతో తాను వెళ్లానని వివరించారు. విద్యార్థినుల ఆరోగ్యం బాగుందని, హాస్టల్‌కు తిరిగి వచ్చారని తెలిపారు. పాఠశాల చుట్టుపక్కల పొలాలు ఉండటం, వాటికి వేసే మందుల వాసనతో పిల్లలు అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు చెప్పినట్టు ఎంఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు.