ఆడవాళ్లకు ‘బంగారం’ అంటే మహాప్రీతి. పండుగైనా.. ఫంక్షనైనా.. ఒంటిమీద పసిడి నగలు ఉండాల్సిందే! కానీ, కాలం గడుస్తున్న కొద్దీ.. కనకం కళ తప్పుతుంది. నగలు నల్లగా మారి.. కాంతిహీనంగా కనిపిస్తాయి. మరి, కాంచనం ఎప్పుడూ కొత్తదానిలా కళకళలాడాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
నగలపై ఉండే మురికిని వదిలించడంలో లిక్విడ్ డిటర్జెంట్ చక్కగా పని చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ కలిపి.. నగలను అందులో ఓ పది నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత బ్రష్‌తో శుభ్రం చేస్తే చాలు.. నగలు మళ్లీ కొత్త వాటిలా మెరుస్తాయి. లిక్విడ్ డిటర్జెంట్‌కు బదులుగా.. టూత్ పేస్ట్ వాడినా మంచి ఫలితం ఉంటుంది.
నగలను అలంకరించుకొని మేకప్ వేసుకోకండి. ఎందుకంటే, మేకప్ రేణువులు ఆభరణాలపై పడి.. అవి మురికిగా మారుతాయి. మేకప్ కోసం వాడే కొన్నిరకాల క్రీముల్లోని కెమికల్స్.. బంగారంతో రసాయన చర్యలు జరుపుతాయి. ఫలితంగా.. బంగారం ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అందుకే, మేకప్ పూర్తయిన తర్వాతే నగలు వేసుకోండి. కొన్ని ప్రాంతాల్లో నీటిలో క్లోరిన్ ఎక్కువగా ఉంటుంది. క్లోరిన్ ప్రభావంతో బంగారం రంగు మారుతుంది. 24 క్యారెట్ల బంగారంపై అంతగా ప్రభావం చూపకపోయినా.. తక్కువ క్యారెట్ల బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలకు ఎక్కువ హాని కలుగుతుంది. అందుకే, క్లోరిన్ ఎక్కువగా ఉండే నీటితో స్నానం చేసేటప్పుడు ఆభరణాలను తీసేయండి.
చాలామంది నగలన్నిటినీ కలిపి ఒకే పెట్టెలో భద్రపరుస్తాయి. ఇలా చేయడం నగలకు చేటు చేస్తుంది. గొలుసులు చిక్కులు పడిపోవడం, గీతలు పడటం, విరిగి పోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి, నగలను వేరువేరుగానే కాటన్ వస్త్రంలో చుట్టి.. పెట్టెలో దాచుకోవడం మంచిది.
ఒంటిపై చెమట వల్లకూడా బంగారం నల్లగా మారుతుంది. అందుకే, చెమట ఎక్కువగా పట్టేవాళ్లు వేసవిలో నగలను దూరం పెట్టండి. ఏదైనా సందర్భం కోసం పెట్టుకున్నా.. త్వరగా తీసేయండి.