Green Prescription | మానవ జీవితం ఇప్పుడు యాంత్రికం. తినే తిండి, తాగే పానీయం, కట్టుకునే బట్టలు.. రసాయన మిళితం! ఫలితంగా ఆరోగ్యానికి దెబ్బ. ఆయువుకూ ప్రమాదం! పదేండ్లకే తెల్లజుట్టు, మూడుపదులకే ముఖానికి ముడుతలు, నలభై ఏండ్లకే జీవితం సమాప్తం! ప్రకృతితో మమేకమైతే ఈ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. గ్రీన్ ప్రిస్క్రిప్షన్ పాటిస్తే అందమైన జీవితాలు మీ సొంతం అంటున్నారు నిపుణులు!
హరితమార్గంలో వెళ్లాలి అంటే ‘గ్రీన్ ప్రిస్క్రిప్షన్స్’ తప్పక పాటించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలికి, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టే ‘పచ్చని మందుల చీటీ’ పాపులర్ అవుతున్నది. ఈ సూత్రాలను పాటిస్తే కొత్త జీవితాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
ఆధునిక జీవనశైలి ఎంత సౌకర్యవంతమో అంతే ప్రమాదకరం. ఈ రోజుల్లో బీపీ, షుగర్లు చాలా సాధారణం అయిపోయాయి. క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. పదేండ్ల పిల్లలు కూడా మధుమేహానికి దగ్గరవుతున్నారు. క్యాన్సర్ మహమ్మారికి బలవుతున్నారు. హెల్త్ మేనేజ్మెంట్ ఉంటే ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చు. మెడిసిన్‌తో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే హెల్త్ మేనేజ్మెంట్ ఉద్దేశం. ‘ద లాన్సెట్’ జర్నల్ అధ్యయనం ప్రకారం కొవిడ్ సోకిన తర్వాత మూడేండ్ల వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. జీవన నాణ్యతను ప్రభావితం చేసి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది. ఇలాంటి సమస్యలను హెల్త్ మేనేజ్మెంట్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నది. అందులో భాగంగా ‘గ్రీన్ ప్రిస్క్రిప్షన్’ సిఫారసు చేస్తున్నది.
‘గ్రీన్ ప్రిస్క్రిప్షన్’ ముఖ్య ఉద్దేశం ప్రకృతికి దగ్గరవడం. ప్రకృతితో మమేకం కావడం ద్వారా వ్యాధి నివారణను సులభతరం చేయవచ్చు అంటున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రకృతిని గొప్ప ఆరోగ్య వనరుగా డబ్ల్యూహెచ్ఓ అభివర్ణిస్తున్నది. ‘గో బ్యాక్ టు నేచర్’ అనే పిలుపును మొదటగా అందుకున్నది ఫిన్లాండ్ దేశస్తులు. నెలలో కనీసం పది గంటలపాటు ప్రకృతి ఒడిలో గడపడం అక్కడి సంప్రదాయంగా వస్తున్నది. అడవిలో
ఉండేందుకు తగిన సౌకర్యం లేనివాళ్లు పార్కుల్లో గడుపుతున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, కెనడా, కొలంబియా వంటి దేశాల్లో గ్రీన్ ప్రిస్క్రిప్షన్‌ను డాక్టర్లు అమల్లోకి తీసుకొచ్చారు. పచ్చని పచ్చికబయళ్లు భౌతికంగా, మానసికంగా సాంత్వన చేకూర్చి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పెంపొందిస్తాయని ఆయా దేశాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గ్రీన్ ప్రిస్క్రిప్షన్ అంటే హరిత పరిసరాల్లో గడపడం ఒక్కటే కాదు. పార్క్‌ల్లో నడవడం, పర్వతాలను ఎక్కడం, అటవీస్నానం, నీటితో కాలక్షేపం, బోటింగ్, పూలపాన్పుపై పడుకోవడం, చెప్పులు లేకుండా గడ్డిలో నడవటం వంటివన్నీ దీంట్లో భాగమే. స్నేహితులతో కలిసి ఫైర్ క్యాంప్‌లకు వెళ్లడం, శుభ్రంగా తినడం, వ్యాయామం చేయడం కూడా గ్రీన్ పిస్క్రిప్షన్గానే పేర్కొంటున్నారు. ప్రధానంగా సామాజిక సమూహాలలో చేరడాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. కొత్తవారు, అంతగా పరిచయం లేని సహోద్యోగులతో స్నేహం ఏర్పరుచుకోవడం, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం, పెంపుడు జంతువులను మచ్చిక చేసుకోవడం సామాజిక సమూహంలో భాగం. ఈ ప్రిస్క్రిప్షన్‌ను పాటిస్తే ఎలాంటి ఔషధాలు లేకుండానే అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, మానసిక వ్యాధులు, నిద్ర రుగ్మతలు, అర్థంలేని ఆందోళనలు వంటి సమస్యలకు ప్రకృతి వైద్యమే ఔషధం అంటున్నారు డాక్టర్లు.
ట్రీట్మెంట్ ప్లాన్‌లో భాగంగా కొందరు జాతీయ ఉద్యానవనాలు, సముద్ర తీరాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. మీరట్‌కు చెందిన ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సురేశ్ సహాయ్ తన రోగులకు ఇటీవలే గ్రీన్ ప్రిస్క్రిప్షన్లు రాయడం మొదలుపెట్టాడు. ప్రకృతి చెంత సేదతీరడం వల్ల ఎండోక్రైనాలాజీ వ్యవస్థ ప్రభావితం అవుతుందట. డాక్టర్ సహాయ్ రాసిన గ్రీన్ ప్రిస్క్రిప్షన్‌ను ఫాలో అయిపోయి.. మధుమేహం, థైరాయిడ్, ఎముకల వ్యాధి, వంధ్యత్వం వంటి సమస్యలు తగ్గినవాళ్లు చాలామందే ఉన్నారు. దేశంలోని దాదాపు 70 దాకా జాతీయ ఉద్యానవనాలు హాట్స్పాట్లుగా మారాలని సహాయ్ చెబుతున్నారు. దక్షిణ కొరియాలో సంప్రదాయంగా కొనసాగుతున్న ‘అటవీ స్నానం’, అమెరికాలోని ‘పేషెంట్ పార్క్’లు మన కల్చర్‌లో కూడా భాగం కావాలనేది సహాయ్ ఆకాంక్ష. వీటివల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెబుతున్నారు. రోజూ కాసేపు పచ్చదనాన్ని చూస్తూ కోర్చోవడం వల్ల నేత్ర ఆరోగ్యం మెరుగుపడుతుందని, చింతలూ చికాకులూ తొలగిపోతాయని మనవాళ్లు ఎప్పటి నుంచో చెబుతున్నారు. మనమే పెడచెవిన పట్టాం. ఆ ఫలితం అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మారిపోదాం. అడవికి పోదాం. ఒంటరి జీవితాలకు సామాజిక సంబంధాలు, ప్రకృతి సహవాసంతోపాటు సహజత్వాన్ని ఆస్వాదించడం కూడా గ్రీన్ ప్రిస్క్రిప్షన్‌లో భాగంగా చేర్చారు వైద్యులు. ఉదాహరణకు పట్టణాల్లో తగినంత సూర్యకాంతి లభ్యం కాదు. కానీ భానుడి కిరణాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. మెదడులో సెరటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి కావాలంటే కచ్చితంగా సహజమైన సూర్యరశ్మి కావాల్సిందే అంటున్నారు ఢిల్లీకి చెందిన లైఫ్ కోచ్ మృదులా రామన్. ఒంటరి జీవుల్లో గుండె సంబంధ సమస్యలు వస్తాయనీ.. గ్రీన్ ప్రిస్క్రిప్షన్లను పాటిస్తే ఆ తీవ్రతను తగ్గించుకోవచ్చంటున్నారు. డిప్రెషన్ నుంచి త్వరగా బయటపడేసే శక్తి ప్రకృతికే ఉందని అంటున్నారు. ఆలస్యమెందుకు.. పచ్చని ప్రపంచానికి చుట్టాలుగా వెళ్దాం పదండి.