అయిజ : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తింది. వరుణుడు కరుణించడంతో ఎగువన భారీ వర్షాలు కురవడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా ఎగువన వానలు అడపాదడపా కురిసినా ఆర్డీఎస్ ఆనకట్టకు వరద చేరలేదు. దీంతో ఆర్డీఎస్ ఆయకట్టులో పంటల సాగు చేపట్టలేదు. వరద వస్తుందన్న ఆశతో కొందరు రైతులు నారుమళ్లు పోసుకున్నా వరద రాకపోవడంతో ఎండిపోయాయి. ఆయకట్టు భూములు బీళ్లుగా మారాయి. గత మూడు నెలలుగా తుంగభద్రకు వరద రాకపోవడంతో నదిలో నీటి జాడలు కరవయ్యాయి. దీంతో ఆర్డీఎస్ ఆయకట్టు రైతులతోపాటు నదీతీర ప్రాంతాల ప్రజలు నీటికి అష్టకష్టాలు పడుతున్నారు.
వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తింది. గురువారం ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో 12,233 వచ్చి చేరుతుండగా, ఆర్డీఎస్ ఆనకట్ట 9.2 అడుగులకు చేరుకోగా ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆనకట్టపై నుంచి దిగువకు పారుతున్న వరద తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మీదుగా సుంకేసుల బ్యారేజీకి పరుగులు పేడుతోంది. తుంగభద్ర నది, ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.