గద్వాల/అయిజ, జూలై 28 : కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. మంగళవారం సాయంత్రానికి 18 వేల క్యూసెక్కుల వరద చేరుకున్నది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ( 9.657 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 318.00 మీటర్ల (8.611 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నది.
విద్యుదుత్పత్తికి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతోపాటు నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్-1కు 1,300, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 630 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు మొత్తం ఇన్‌ఫ్లో సాయత్రం 6:30 గంటల వరకు 18 వేలు కాగా అవుట్ ఫ్లో 32,727 క్యూసెక్కులుగా నమోదైంది. ఒక వేళ నారాయణపూర్ డ్యామ్ నుంచి 84 వేల పైచిలుకు క్యూసెక్కుల వరద వస్తే ఏ క్షణమైనా జూరాల గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర డ్యామ్‌లో నీటి నిల్వ క్రమేపీ పెరుగుతున్నది. మంగళవారం టీబీ డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 19,197 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 3,600 క్యూసెక్కులుగా నమోదైంది. గరిష్ఠ నీటి మట్టం1,633 అడుగులకు గాను ప్రస్తుతం 1,608.19 అడుగుల నీటిమట్టం ఉండగా 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 34.148 టీఎంసీల నీటి నిల్వ ఉన్నదని డ్యామ్ సెక్షన్ అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు.