హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం కురుస్తున్న వానలను చూసి వరిసాగు చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. ఈ వర్షాలతో చెరువులు నిండే పరిస్థితి లేదని, భూగర్భ జలాలు కూడా పెరుగవని తెలిపారు. మంగళవారం రైతువేదికల్లో నిర్వహించిన 100వ ఎపిసోడ్ రైతునేస్తం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూతో కలిసి పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ… ఆయిల్‌పామ్, ఉద్యాన పంటలు, తకువ నీటితో సాగయ్యే పంటలను పరిశీలించాలని సూచించారు. బోర్ల కింద, ప్రాజెక్టుల కింద ఏ ప్రాంతంలో ఏ పంటలు అనుకూలమో శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేయాలని పిలుపునిచ్చారు.
ఎల్ నినోతోపాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం నిర్మించిన రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించి, రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, తద్వారా రైతులకు విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే రైతునేస్తం ద్వారా రైతులు అడిగే ప్రశ్నలకు అదే సమయంలో శాస్త్రవేత్తల నుంచి సమాధానాలు లభిస్తున్నాయని, దీనివల్ల పంటలకు నష్టం కలుగకముందే సరైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం రైతులకు లభిస్తున్నదని మంత్రి వివరించారు.
సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావుతో కలిసి సీడ్ కంపెనీల ప్రతినిధులు, సీడ్ కంపెనీ అసోసియేషన్ సభ్యులు, వివిధ జిల్లాల్లో పత్తి విత్తనోత్పత్తిలో భాగస్వాములైన ఆర్గనైజర్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలపై మంత్రి తుమ్మల సీడ్ కంపెనీల ప్రతినిధులను వివరణ కోరారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలన్నింటినీ ఈ ఏడాది ఆగస్టులో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.