శ్రీశైలం : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికి ( Srisailam Reservoir ) వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుంది. జూరాల ( Jurala ) , సుంకేశుల ( Sunkesula ) ప్రాజెక్టుల నుంచి వరద తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ఒక గేటు ద్వారా నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఈ జలాశయానికి 1,35,511 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా 1,23,897 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేర్ నుంచి 30 వేల క్యూసెక్కులు , ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు , కూడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,012 క్యూసెక్కుల నీటిని, ఒక స్పిల్‌వే గేటును 10 అడుగులు ఎత్తి 27,570 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.90 అడుగుల వరకు నీరు ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 209.15 టీఎంసీలకు ప్రస్తుతం 215.80 టీఎంసీల నీరు నిల్వ ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.