ములుగు : ములుగు జిల్లా ఎటూరునాగారం మండలంలోని పలు గ్రామాలలో పర్యటిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి శశాంక కాన్వాయ్‌ని కొండాయి గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. ఏటూరునాగారం మండలంలోని దొడ్ల వాగును పరిశీలించి ఏటూరు నాగారం వస్తున్న ఉమ్మడి జిల్లా వరదల ప్రత్యేక అధికారి శశాంక కాన్వాయ్ ను కొండాయి వరద బాధితులు అడ్డుకున్నారు.
అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీతో పాటు మరికొందరు అధికారులు కాన్వాయ్ లోని తమ వాహనాల నుంచి దిగివచ్చి వారితో మాట్లాడారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వరదలు వస్తే ముందుగా మునిగేది మా ఇండ్లే అని రెండు సంవత్సరాలుగా తమకు ఇండ్ల స్థలాలు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు వేసుకుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని అధికారులకు వరద బాధితులు వివరించారు.