హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీని ప్రభావం విమానా ప్రయాణాలపై పడుతున్నది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. శుక్రవారం ఉదయం నుంచి పలు విమానాలను ల్యాండింగ్‌కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతించడం లేదు. విమానాలు దిగడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో వాటిని దారిమళ్లిస్తున్నారు.
కోల్‌కతా, ముంబై, పుణె నుంచి వచ్చిన ఇండిగో విమానాలను విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు దారిమళ్లించారు. శంషాబాద్ విమానాశ్రయంలో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అధికారులు ప్రకటించారు. కాగా, విమానాలను దారిమళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తమ గమ్యస్థానానికి మళ్లీ ఎప్పుడు తీసుకొస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు.