తుర్కయంజాల్, సెప్టెంబర్ 26: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్- బ్రాహ్మణపల్లి మధ్య కల్వర్ట్ వద్ద తవ్విన రోడ్డును యధాతథంగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఆ మార్గంలో అలుగు కాలువ తీయడానికి వచ్చిన హైడ్రా (HYDRAA) అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మర్రి సంపతీశ్వర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గత 50 ఏండ్లుగా తొర్రూర్- బ్రాహ్మణపల్లి మధ్య ఎలాంటి అలుగు లేదని, రోడ్డు మాత్రమే ఉన్నదని స్పష్టం చేశారు.
కొన్ని నెలల క్రిత నీటిపారుదల శాఖ అధికారులు ఇక్కడ అలుగు ఉందని రోడ్డును తవ్వారని, తొర్రూర్‌కు చెందిన కొందరు వ్యక్తులు అడ్డుకోవడంతో తవ్విన రోడ్డును అలాగే వదిలేసి వారు వెనుతిరిగారని చెప్పారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షానికి వర్షం నీరు చేరడంతో తొర్రూర్- బ్రాహ్మణ పల్లి మధ్య రాకపోకలకు ఇబ్బందులు తలేత్తయన్నారు. చెరువు నీరు వచ్చే కాలువ, అలుగు ఒకేచోట ఎలా ఉంటాయని వారు అధికారులను ప్రశ్నించారు. వివాదాలను కోర్టు ద్వారా తేల్చుకోవాలని, తమకు మాత్రం వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని బ్రాహ్మణపల్లి వాసులు రోడ్డు పై బైఠాయించారు.