Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓజీ’ (OG) సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాగా, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలు, రియాక్షన్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ సినిమా విషయమై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీసుకున్న యూ-టర్న్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదలకు ముందు అంబటి రాంబాబు ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేస్తూ, “పవన్ కళ్యాణ్ ఈసారి కసితో పనిచేశాడు. దర్శకుడు సుజీత్, నిర్మాత దానయ్య పట్టుదలతో పనిచేశారు. వీరి కష్టానికి ఫలితం రావాలనే నా కోరిక. ఓజీ ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది” అంటూ వ్యాఖ్యానించారు.
రాజకీయ ప్రత్యర్థి అయినా పవన్ సినిమాకు ఈ స్థాయిలో మద్దతుగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించినా, జనసైనికులు ఈ వ్యాఖ్యలను స్వాగతించారు. బుధవారం రాత్రి సినిమా విడుదలైన తరువాత, అంబటి రాంబాబు ట్విట్టర్లో చేసిన మరో ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ప్రత్యర్థి అయినా పవన్ సినిమా ఆడాలని నా ఆరాటమే కానీ ఫలితం మాత్రం శూన్యం. దానయ్యా… దండగ పడ్డావయ్యా!” అని పేర్కొంటూ, OGపై నెగటివ్ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీనితో ఆయనపై పవన్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
పవన్ అభిమానులు సోషల్ మీడియాలో అంబటి రాంబాబును ఉద్దేశిస్తూ,నీ నుంచి దీన్నే ఆశించాం. నీ మాటల వెనక కపటత్వం దాగి ఉంది అని మాకు తెలుసు. “OG హిట్ అవుతుందని నమ్మినవారు, ఇప్పుడు ఫ్లాప్ అనడమేంటీ? అంటూ ధ్వజమెత్తుతున్నారు. మొత్తానికి ఓజీ సినిమా పొలిటికల్‌గా కూడా చర్చనీయాంశం అయింది. ఇక ఓజీ సినిమా విషయానికొస్తే… డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మాస్ లుక్‌తో కనిపించాడు. థమన్ సంగీతం, సుజీత్ దర్శకత్వం మంచి టెక్నికల్ విలువలతో సినిమా మంచి విజయం సాధించింది.. అయితే సినిమా విడుదలైన తర్వాత, కొంత మిశ్రమ స్పందన రావడం, కొందరు యాంటీ ఫ్యాన్స్ దీన్ని “డిజాస్టర్”గా ట్యాగ్ చేయడం కూడా జరుగుతోంది. అయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం సినిమాపై పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నారు.