బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) అద్వితీయ ప్రదర్శన కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా టాప్-4 లక్ష్యంగా దూసుకెళుతున్న హెచ్ఎఫ్సీ..సోమవారం నార్త్ఈస్ట్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో లీగ్‌లో ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో 10 పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచింది. మ్యాచ్ విషయానికొస్తే..నార్త్ఈస్ట్పై మరోమారు గెలుపు ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ హెచ్ఎఫ్సీ తరఫున చింగ్లేన్సన సింగ్(12ని), ఓగ్బాచె(27ని, 78ని), అనికేత్(90ని), సివెరియో(90+ని) గోల్స్‌తో విజృంభించారు. మరోవైపు నార్త్ఈస్ట్ తరఫున రాల్టె(43ని) ఏకైక గోల్ చేశాడు. సూపర్ ఫామ్‌మీదున్న ఓగ్చాచె మరో రెండు గోల్స్ ఖాతాలో వేసుకుని మొత్తంగా ఐదు గోల్స్‌తో దూసుకెళుతున్నాడు.