హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా జనరల్ దవాఖాన వైద్యులు దేశంలోనే తొలిసారిగా అత్యంత క్లిష్టమైన ‘మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ను విజయవంతంగా నిర్వహించారు. బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ అవయవదాత నుంచి సేకరించిన ఐదు ప్రధాన జీర్ణాశయ అవయవాలను ఒకే రోగికి విజయవంతంగా మార్పిడీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏండ్ల ఇంజినీర్ ‘ఫ్యామిలియల్ అడెనోమేటస్ పాలిపోసిస్ కోలి’ అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు మొత్తం పెద్దపేగు (టోటల్ కోలెక్టమీ) తొలగించడంతోపాటు చిన్నపేగులో సుమారు 60 శాతం తొలగించారు.
దాంతో ఆయనకు షార్ట్ గట్ సిండ్రోమ్ ఏర్పడి, శరీరానికి అవసరమైన పోషకాలు అందక వేగంగా బరువు తగ్గుతూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఉస్మానియా దవాఖాన గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని వైద్య బృందం దాదాపు 36 గంటల పాటు ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ ప్రక్రియలో ఒకేసారి ఐదు కీలక అవయవాలను రోగికి అమర్చారు.