అబుదాబి: అబుదాబి తన తొలి అటానమస్ (డ్రైవర్ రహిత) డెలివరీ వాహనం పైలట్ ప్రోగ్రామ్‌ను మస్డర్ సిటీలో ప్రారంభించింది. స్థానిక టెక్నాలజీ, లాజిస్టిక్ సంస్థలతో కలిసి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత లాజిస్టిక్స్‌ను రోజువారీ జీవితంలో ఉపయోగించుకునేందుకు చేపట్టిన మొదటి కార్యక్రమం ఇదే. ఈ వాహనాలను ఆటోగో అభివృద్ధి చేసింది. వీటికి డ్రైవర్లు అవసరం లేదు. కృత్రిమ మేధ, అడ్వాన్స్డ్ స్మార్ట్ మొబిలిటీ సిస్టమ్స్‌తో ఇవి పని చేస్తాయి. వెహికల్‌కు అబుదాబి మొట్టమొదటి అధికారిక లైసెన్స్ ప్లేట్‌ను మంజూరు చేసింది.