హైదరాబాద్ సిటీబ్యూరో/అబిడ్స్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. చిరాగ్అలీ లేన్‌లోని ఓ ఐదంతస్తుల భవనంలోని ఫర్నిచర్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సెల్లార్లో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనావేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగాయి. ఐదు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రమా దం జరగగా అక్కడినుంచి మంటలు పైన ఉన్న అన్ని అంతస్తులకు క్షణాల్లోన్నే వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో ఐదుగురు భవనం సెల్లార్ లోపలే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. వీరిలో భవనం వాచ్మెన్ యాదయ్య పిల్లలు అఖిల్, ప్రణీత్, ఫర్నిచర్షాపులో పనిచేస్తున్న హబీబ్, ఇంతియాజ్, స్వీపర్ బేబి ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. ఇప్పటికీ వీరి ఆచూకీ తెలియలేదు. లోపల దట్టంగా పొగ ఉండటంతో లోపలకు వెళ్లడం కష్టమవుతున్నదని సహాయక బృందాలు చెప్పాయి. షాపు యజమాని సతీశ్ పోలీసులకు సమాచారమందించడంతోపాటు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో మొదట నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాలేదు. అప్పటికే ఘటనాస్థలానికి చేరుకున్న కలెక్టర్ హరిచందన, సీపీ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి సహాయకచర్యలు ముమ్మరం చేశారు.
కలెక్టర్ ఆదేశాలతో మొత్తం పది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపుచేసేందుకు యత్నించారు. రాత్రి పదిగంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చినా పొగ అలుముకునే ఉన్నది. మరోవైపు జేసీబీలు తీసుకొచ్చి భవనానికి రంధ్రాలు చేసి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. సెల్లార్లో పెద్ద ఎత్తున ఫర్నిచర్‌తోపాటు అద్దాలు కూడా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ క్రేన్ల సాయంతో నాలుగు, ఐదవ అంతస్తుల్లోని కిటికీల అద్దాలు పగులగొట్టి లోపల చిక్కుకున్న వారిని సహాయకబృందాలు రక్షించాయి.
మరోవైపు రోబోల సాయంతో సెల్లార్లోకి వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా విజిబులిటీ లేకపోవడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఫర్నిచర్ మొత్తం అంటుకుని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పై అంతస్తుల నుంచి భవనం లోపల ఉన్నవారిని రెస్క్యూ టీమ్స్ బయటకు తీసుకొచ్చారు. మరోవైపు భవనం పరిసర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని నివాసితులను అధికారులు అక్కడినుంచి ఖాళీ చేయించారు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం జరగడంతో పరిసర ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి.
అబిడ్స్, నాంపల్లి, ఎంజే మార్కెట్, ఏక్‌మినార్ మసీదు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఫైర్‌ఇంజిన్లు, అత్యవసర వాహనాలు వేగంగా వెళ్లడానికి వీలుగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు ఈ మార్గాల్లో రావద్దని కోరుతున్నారు. ప్రస్తుతం నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరుగుతుండటంతో జనసంచారం విపరీతంగా ఉంటుంది. అగ్నిప్రమాదం, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. అగ్ని ప్రమాద ప్రాంతం వద్ద పోలీసులు, ఫైర్, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.