తల్లిగర్భంలో ప్రాణం పోసుకున్నప్పటి నుంచి పుడమి తల్లి గర్భంలో కలిసిపోయేంత వరకు మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉంటుంది . ఆక్సిజన్ తీసుకోవడం ఆగిపోయాక జీవితం ముగిసిపోతుంది . అప్పుడు కూడా డబ్బు అవసరమే. జీవితంలో డబ్బు అంత కీలకంగా మారిపోయింది. ఇలాంటి డబ్బు గురించి మనకు పాఠ్య పుస్తకాల్లో చెప్పరు. ఇంట్లో చెప్పరు. జీవితం చివరి దశలో అనుభవాలే డబ్బు గురించి బాగా చెబుతాయి.
అప్పటికి చేయగలిగింది ఏమీ ఉండదు. జీవితంలో డబ్బు ప్రాముఖ్యత ఏమిటో చెబుతూ- ఈ సత్యాన్ని గుర్తించని మహనీయుల జీవితాలు అంతిమ దశలో ఎలా దుర్భరంగా గడిచాయో వారి జీవిత కథలు వివరిస్తూ బుద్దా మురళి రాసిన పుస్తకమే ‘లక్ష్మీ కటాక్షం- డబ్బుకు విలువ ఇస్తేనే నిలుస్తుంది’. పుస్తకం చదివితే ముందు మనసు కకావికలం అవుతుంది . తరువాత అమ్మో మన జీవితం అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచన పుడుతుంది.
మనం ఆరాధించిన చిత్తూరు నాగయ్య , కాంతారావు, రాజనాల, రాజబాబు, గిరిజ లాంటి మహనీయుల జీవితాలే చివరి దశలో అలా ముగిస్తే మన జీవితం ఏమిటీ అనే ఆలోచన వస్తుంది. కాంతారావు పేరు వినగానే రాజకుమారుడు అంటే ఇలానే ఉంటాడు అనిపిస్తుంది. మెరిసిపోతున్న కత్తిని తిప్పుతూ శత్రువుపై విజయం సాధించే రాజుగానే కనిపిస్తాడు. కానీ, నిజ జీవిత పోరాటంలో పూర్తిగా ఓడిపోయి ఇల్లు గడవడం కోసం సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న వేషాలు వేసుకొని బతికారు ఆయన. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణ యుగం. అదే సమయంలో ఆ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చాలామంది మహానటుల వ్యక్తిగత జీవితాలు మాత్రం చివరి దశలో దుర్భరంగా గడిచాయి. తోట రాముడిగా ఎన్టీయార్ పాతాళ భైరవిలో రాజకుమారి కోసం ఎన్నో సాహసాలు చేశాడు.
అలాంటి రాజకుమారి నిజ జీవిత చరమాంకంలో చిన్నగదిలో ఎవరికీ తెలియకుండా అనామక జీవితం గడిపింది. వర్షానికి గోడ కూలి మరణించాక.. ఆమె పాతాళ భైరవి రాజకుమారి అని తెలిసింది. గుండెలను పిండేసే ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఈ పుస్తకంలో విశదీకరించారు రచయిత. చేతిలో డబ్బు ఉన్నప్పుడు దానికి సరైన విలువ ఇవ్వకపోవడమే వీటన్నిటి వెనుక ఏకైక కారణం. పుస్తకం రెండు భాగాలుగా ఉంటుంది. డబ్బుకు విలువ ఇవ్వని వారి దుర్భర జీవితాలు మొదటి భాగం. మన జీవితం అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, డబ్బును ఎలా పొదుపు చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలో రెండో భాగం చెబుతుంది. జీవితంలో డబ్బుకు విలువ ఉంటుంది అని అంగీకరించే వాళ్లందరూ దీనిని చదవాల్సిందే! డబ్బుదేముంది వస్తుంది, పోతుంది అని నిర్లిప్త ధోరణితో ఉండేవాళ్లు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
రచయిత: బుద్దా మురళి
పేజీలు: 170, ధర: రూ. 200
ప్రతులకు: 9849998087
-నామాల విశ్వేశ్వర రావు