రాష్ట్ర ప్రభుత్వం అడవిబిడ్డల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్నది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్థిక సహాయ పథకం ద్వారా రూ. 45.32 కోట్లు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గ్రౌండింగ్ పూర్తి చేసి అర్హులకు రుణాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమ్రం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులకు ఆర్థిక సహాయ పథకంతో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో రూ. 10.04 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబందించి 35.28 కోట్లు కేటా యించింది. ఈ నిధులతో ఉమ్మడి జిల్లాలోని అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు అందించనున్నారు. ఇప్పటికే ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా 16,958 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు అర్హులను గుర్తించి వారికి జీవనోపాధిని కల్పించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు ప్రధానంగా వ్యవసాయం చేస్తుంటారు. ఐటీడీఏ ద్వారా అమలవుతున్న పథకాలు కూడా ఎక్కువగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అమలవుతున్నాయి. గిరిజన రైతులకు నీటి వసతి కోసం అవసరమైన ఆయిల్ ఇంజిన్లు, పైపులైన్లు, త్రెషర్స్, పవర్ టిల్లర్లు, తుంపర్ల సేద్య, బిందుసేద్యం పరికరాలు, పాడి గేదెలు, ఎడ్ల జతలు, బండ్లు, గొర్రెలు వంటి వాటిని అందిస్తోంది. అలాగే నర్సరీల పెంపకం, ఉద్యానవనాల అభివృద్ధి, రైతుల కోసం బిందు సేద్యం, స్ప్రేయర్ల్ అందించేందుకు చర్యలు చేపడుతున్నది.
వ్యవసాయ రంగం అభివృద్ధితోపాటు గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఆదివాసీ యువతకు ఆటోలు, మినీ వ్యాన్లు, మొబైల్ పాయింట్లు, బట్టల దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, ఫొటోగ్రఫీ, టైలరింగ్, టెంట్హౌస్లు, బ్యూటీ పార్లర్లు వంటి స్వయం సహాయక ఉపాధి పథకాలను అమలు చేయనున్నది.
జిల్లా దరఖాస్తుల సంఖ్య 2020-21 (నిధులు) 2021-22(నిధులు)
ఆదిలాబాద్ 8804 4. 24 15.99
ఆసిఫాబాద్ 4155 2. 52 9.51
మంచిర్యాల 2072 1. 76 4.05
నిర్మల్ 1927 1.52 5.73