– మూడు దశాబ్దాలుగా రైతు యాలాద్రి విజయయాత్ర
జూలూరుపాడు, మే 02 : వ్యవసాయం అంటే కేవలం చెమట చిందించడమే కాదు. అది ఒక నిరంతర తపస్సు, పక్కా ప్రణాళికతో కూడిన జీవన కళ అని నిరూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ సీనియర్ రైతు. మూడు దశాబ్దాలకు పైగా ఒకే పంటను నమ్ముకుని, స్వయంకృషితో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన ఏరిదేసి యాలాద్రి (63) అనే రైతుకు మొత్తం 3.50 ఎకరాల పొలం ఉన్నప్పటికీ, ఆయన విజయంలో కీలకం మాత్రం ఆ ‘అరెకరం’ పుదీనా సాగుదే. గత 35 ఏళ్లుగా సాంప్రదాయ పంటల వెనుక పరుగులు తీయకుండా, మార్కెట్లో నిత్యం డిమాండ్ ఉండే పుదీనాను సాగు చేస్తూ తన జీవన గమనాన్ని మార్చుకున్నారు.
యాలాద్రి సాగు పద్ధతి చాలా ప్రత్యేకమైనది. ఒకేచోట కాకుండా, భూసారాన్ని కాపాడుకుంటూ ఏటా అరెకరం చొప్పున స్థలాన్ని మారుస్తూ పుదీనాను సాగు చేస్తారు. పుదీనాకు కేటాయించిన అరెకరం కాకుండా, మిగిలిన మూడు ఎకరాల్లో పత్తితో పాటు సేంద్రీయ పద్ధతుల్లో ఇతర పంటలను సాగు చేస్తూ ప్రకృతితో మమేకమవుతున్నారు. కూలీల మీద ఆధారపడకుండా యాలాద్రి తన భార్యతో కలిసి ప్రతిరోజూ పొలంలో శ్రమిస్తారు. దంపతులిద్దరూ సొంతంగా సాగు పనులు చూసుకోవడం వల్ల పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గడమే కాకుండా, పంటపై పూర్తి పట్టు సాధించారు.

సాగులో ‘పుదీనా’ పరిమళం.. అరెకరంతోనే ఆర్థిక భరోసా
పుదీనా సాగు ద్వారా వచ్చే నిలకడైన ఆదాయం యాలాద్రి కుటుంబానికి పెద్ద అండగా నిలిచింది. రోజుకు సుమారు రూ.1,000 నుండి రూ.2,000 వరకు ఆదాయం పొందుతూ నెలకు సగటున రూ.40 వేల నుండి 50 వేల వరకు ఆర్జిస్తున్నారు. ఈ సంపాదనతోనే తన కుమార్తె రాజేశ్వరిని ఉన్నత చదువులు చదివించి ఒక తండ్రిగా తన బాధ్యతను అత్యంత గౌరవప్రదంగా నెరవేర్చారు. పుదీనా అనేది ప్రతిరోజూ వంటల్లో, హోటళ్లలో అవసరమయ్యే నిత్యావసర వస్తువు. అందుకే మార్కెటింగ్ సమస్యే రాదు అని యాలాద్రి ధీమాగా చెబుతారు. తెల్లవారుజామునే తాజాగా కోసి మార్కెట్కు చేరవేయడం వల్ల వ్యాపారులే తన వద్దకు వస్తుంటారన్నారు. నమ్మిన నేల ఎప్పుడూ మోసం చేయదు.. కష్టపడే గుణం ఉంటే అరెకరం పొలం కూడా అన్నపూర్ణమ్మలా ఆదుకుంటుందని ఆదర్శ రైతు ఏరిదేసి యాలాద్రి అన్నారు. ఒకే రకమైన సాగు చేస్తూ పెట్టుబడులు పెట్టి ప్రకృతి వైపరీత్యాలతో అప్పుల పాలవుతున్న రైతులు యాలాద్రి చేపడుతున్న సూత్రాన్ని పాటిస్తూ తక్కువ పెట్టుబడి, నిత్య ఆదాయం వచ్చేలా వినూత్నంగా పంటల సాగు చేపట్టాలని పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పేర్కొంటున్నారు.