కోల్కతా: ప్రధాని మోదీ కానీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానీ, బెంగాలీలు పూజించే దుర్గామాత కూడా 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేరని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. మే 4వ తేదీన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరనున్న నేపథ్యంలో ఆయన్ను ప్రశ్న అడగ్గా.. అలాంటి ప్రశ్నలకు తాను ఎలా సమాధానం ఇవ్వగలనన్నారు. సోమవారం బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసిన తర్వాతే ఆ విషయం తెలుస్తుందన్నారు. అప్పుడే మనకు సమాధానం దొరుకుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఊహాగానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. మమతా దీదీ కానీ, మోదీజీ కానీ, దుర్గామాతా కానీ వాటిని అంచనా వేయలేరన్నారు.
294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 23, 29వ తేదీల్లో ఆ ఎన్నికలు నిర్వహించారు. ఇక ఇవాళ సౌత్ 24 పరగనాస్ జిల్లాలో 15 పోలింగ్ బూత్ల పరిధిలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. బెంగాల్ ఎన్నికలకు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు భారీ స్థాయిలో బందోబస్తు నిర్వహించాయి. తొలి దశ పోలింగ్ 152 స్థానాలు, రెండో దశ 142 స్థానాల్లో జరిగింది. అయితే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ .. బీజేపీకే విజయాన్ని కట్టబెట్టాయి. రెండో స్థానంలో టీఎంసీ ఉన్నది.