రాజన్న సిరిసిల్ల, మే 2 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో మృతులకు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ సంస్కారాలకు బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, సిరిసిల్ల మానేరు తీరం రోదనలతో దద్దరిల్లింది. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ అన్న బొల్లి రాజు – భాగ్యలక్ష్మి దంపతుల పెద్దకొడుకు, శివకుమార్ (40), కోడలు లాస్య (35), మనుమరాలు రిషిక (8), అల్లుడు శ్రీనివాస్ (41), మనుమలు కృష్ణచంద్ర (14), మాధవ్ (11) శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం తర్వాత శనివారం ఉదయం సిరిసిల్లకు మృతదేహాలు చేరుకోగా, మానేరు వాగులో బొల్లి శివకుమార్, భార్య లాస్య, కూతురు రిషికను ఒకే చితిపై, కోడం శ్రీనివాస్, కృష్ణచంద్ర, మాధవ్‌ను మరో చితిపై పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు.

కేటీఆర్ పరామర్శ
ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, శనివారం వారి కుటుంబాలను ఉస్మానియా దవాఖానలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత భౌతిక కాయాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్, అతడి సోదరుడు రాజు కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి రోదనలు చూసి కేటీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. గద్గదస్వరంతో వారిని సముదాయించి ధైర్యం చెప్పారు. అంతకుముందు ప్రమాదం జరిగిన తీరు పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి పోస్ట్‌మార్టం త్వరగా పూర్తయ్యేలా చూశారు. ప్రమాదం నుంచి బయటపడ్డ కోడం తేజశ్రీ (శ్వేత) కిమ్స్‌లో చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను సిరిసిల్లకు కేటీఆర్ పంపించారు.