నార్త్సాండ్ (అంటిగ్వా): అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న యువ భారత జట్టు.. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో శనివారం ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన యంగ్ ఇండియా.. క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌ను, సెమీస్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. ఇప్పటి వరకు నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన యువ భారత్.. శనివారం తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించి పాంచ్ పటాకా మోగించాలని చూస్తున్నది. గత మూడు (2016, 2018, 2020) ప్రపంచకప్‌లలోనూ ఫైనల్‌కు చేరిన యంగ్‌ఇండియా.. 24 ఏండ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించిన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో తొలి మ్యాచ్ అనంతరం కరోనా వైరస్ కారణంగా ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. యంగ్‌ఇండియా ఏమాత్రం ఇబ్బంది పడకుండా వరుస విజయాలు సాధించిందంటే ఈ టోర్నీలో మన జట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కీలక సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ యష్ ధుల్‌తో పాటు తెలుగు ఆటగాడు, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ ఫుల్ జోష్‌లో ఉండగా.. హర్నూర్ సింగ్, రఘువంశీ, దినేశ్ మరోసారి కీలకం కానున్నారు.
ఇంకొక్క విజయమే!
జూనియర్ స్థాయిలో మెరుపులు మెరిపించి 2008 ప్రపంచకప్ నెగ్గిన సారథి విరాట్ కోహ్లీ.. తుదిపోరుకు ముందు యువ జట్టుతో మాట్లాడటం వారిలో మరింత స్ఫూర్తినింపింది. స్టయిలిష్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ మార్గనిర్దేశకత్వంలో ముందుకు సాగుతున్న యంగ్ ఇండియా మరొక్క మ్యాచ్‌లో ఇదే జోరు కొనసాగిస్తే.. రానున్న ఐపీఎల్ మెగా వేలంలో యువ ఆటగాళ్ల పంట పండటం ఖాయమే. కుదురుకునేంత వరకు నిదానంగా ఆడి ఆ తర్వాత భారీ షాట్లకు పోవాలనే ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తున్న యంగ్‌ఇండియా.. శనివారం ఫైనల్లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజృంభించాలని చూస్తున్నది. బౌలింగ్‌లో పేసర్లు రాజ్వర్ధన్, రవికుమార్‌తో పాటు స్పిన్నర్ విక్కీ ఓస్తాల్పై భారం ఉండనుంది. ‘మా జట్టు బలంగా ఉంది. ప్రపంచకప్ నెగ్గే సత్తా మాకుంది’ అని మ్యాచ్ రోజుకు ముందు రషీద్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. మరోవైపు 1998 తర్వాత తొలిసారి ఫైనల్ చేరిన ఇంగ్లండ్ ఇదే జోష్‌లో కప్పు కొట్టాలని తహతహలాడుతున్నది. బ్యాటింగ్‌లో కెప్టెన్ టామ్ ప్రెస్ట్, బౌలింగ్‌లో బొయ్డెన్పై ఆ జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది.