ఖండాలు వేరైనా.. భాషలు భిన్నమైనా క్రీడా జగత్తును ఏకం చేసే మంత్రం! దేశాల మధ్య దూరాలను దగ్గర చేస్తూ, కోట్లాది హృదయాలను ఒకే భావోద్వేగంతో ముడిపెట్టే మహోత్సవం!! ప్రపంచ క్రీడా రంగంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక మహా సంగ్రామం ఫిఫా వరల్డ్ కప్ మళ్లీ వచ్చేసింది!!!
నాలుగేండ్లకోసారి సాకర్ ఆటలోని అసలైన కిక్‌ను అందించే ఈ మెగా టోర్నీ మరికొన్ని గంటల్లో మొదలవనుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్త ఆతిథ్యంలో రికార్డు స్థాయిలో 48 జట్లు, 104 మ్యాచ్‌లు ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగించనున్నాయి.
ఈ సంగ్రామం కేవలం ట్రోఫీ కోసం జరిగే పోరాటం కాదు.. దేశ గౌరవం కోసం సాగే సమరం. ఇది దశాబ్దాల కలలను నిజం చేసుకునే వేదిక. స్టార్లను దిగ్గజాలుగా మార్చి.. కొత్త హీరోలను ప్రపంచానికి పరిచయం చేసే రంగస్థలం. ఆశలు, నిరాశలు, అద్భుతాలు, సంచలనాలతో నిండిన ఫుట్‌బాల్ మహాకుంభమేళా.
ఇక బంతి కదలబోతోంది. కోట్లాది హృదయాలు దాని వెంట పరుగెత్తబోతున్నాయి. ఈ మెగా సమరం ముగిసేదాకా క్రీడా ప్రపంచమంతా ఆ బంతి చుట్టూనే తిరగనుంది.
మెక్సికో సిటీ : అభిమానలోకం ఊపిరి బిగబట్టి చూసే సాకర్ మహాసంగ్రామానికి కౌంట్‌డౌన్ ముగిసింది. నాలుగేండ్లకోసారి వచ్చి యావత్ క్రీడా ప్రపంచాన్ని మురిపించే ఫిఫా ప్రపంచకప్ గురువారం మొదలవుతోంది. ఈ మెగా టోర్నీకి తొలిసారి మూడు దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. అమెరికా, మెక్సికో, కెనడాలోని 16 నగరాల్లో, 39 రోజుల పాటు సాగే ఈ మెగా వార్ అభిమానులను కనువిందు చేయనుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఆతిథ్య మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి పోరుతో ఈ సాకర్ జాతరకు తెరలేవనుంది. ప్రఖ్యాత మెక్సికో సిటీ స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు 90 నిమిషాలపాటు అదిరిపోయే ప్రారంభ వేడుకలు నిర్వహిస్తారు. పాప్ స్టార్ షకీర తదితరులు తమ ప్రదర్శనలతో అలరిస్తారు. జూలై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
ఈ టోర్నీ గతంలో కంటే చాలా భిన్నంగా, భారీగా సాగనుంది. తొలిసారిగా జట్ల సంఖ్యను 32 నుంచి 48 జట్లకు పెంచారు. ఈ 48 జట్లను మొత్తం 12 గ్రూపులుగా (ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు) విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లతో పాటు, మూడో స్థానంలో నిలిచిన అత్యుత్తమ 8 జట్లు కొత్తగా ప్రవేశపెట్టిన రౌండ్ ఆఫ్ -32 నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ఈ కొత్త ఫార్మాట్ వల్ల, టైటిల్ గెలవాలనుకునే జట్టు గతంలో కంటే ఒక మ్యాచ్ అదనంగా.. అంటే మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. దీనివల్ల ఆటగాళ్ల ఫిట్నెస్, బెంచ్ బలం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.
ఈ విశ్వసమరంలో ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు మెగా స్టార్లు బరిలో నిలిచారు. వారిలో ముందున్న వ్యక్తి అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ. 2022లో ఆ జట్టును విజేతగా నిలపడంతో పాటు ప్రపంచకప్ కలను సాకరం చేసుకున్న మెస్సీ మరో కప్‌ను ముద్దాడి తన అద్భుతమైన కెరీర్‌కు వీడ్కోలు పలకాలని పట్టుదలతో ఉన్నాడు. మెస్సీ మాదిరిగా పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు కూడా ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు. తన సుదీర్ఘ కెరీర్లో ఇంకా అందుకోని ఈ కప్ ట్రోఫీని ఈసారైనా సాధిస్తాడో లేదో చూడాలి. గత ఎడిషన్‌లో ఫైనల్ వరకు ఫ్రాన్స్‌ను ఒంటిచేత్తో నడిపించిన కిలియన్ ఎంబపే ఈసారి కూడా తన మెరుపు గోల్స్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపేందుకు సిద్ధమయ్యాడు. ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్లు అమెరికా గడ్డపై యూరప్ జెండా ఎగరేయాలని చూస్తున్నాయి. ఇక బ్రెజిల్ స్టార్ నెమార్ సంప్రదాయ సాంబార్ ఆటతో మ్యాజిక్ చేసి తమ దేశానికి గత 24 ఏండ్లుగా దక్కని కప్పు కలను నిజం చేయాలని చూస్తున్నాడు. లామిన్ యామల్(స్పెయిన్), గిల్బర్టో మొరా (మెక్సికో) వంటి యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో సంచలనాలు సృష్టించడానికి సిద్ధంగా ఉండగా, గత టోర్నీ డార్క్ హార్స్ మొరాకో స్ఫూర్తితో కొన్ని చిన్న జట్లు మేటి జట్లకు షాక్ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

ఈ ఎడిషన్ ఫిఫా వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. మొత్తంగా 655 మిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు రూ. 5,600) కేటాయించారు. విజేతగా నిలిచిన జట్టు అత్యధికంగా 50 మిలియన్లు (సుమారు రూ. 430 కోట్లు)అందుకుంటుంది. మెగా టోర్నీలో ఆడే ప్రతి దేశానికీ కనీస గ్యారెంటీగా 10.5 మిలియన్ డాలర్లు (రూ. 87 కోట్లు) లభిస్తాయి.
ఫిఫా వరల్డ్ కప్‌ను భారత్‌లో జీ ఎంటర్టైన్మెంట్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఆ సంస్థ కొత్తగా ప్రారంభించిన యునైట్8 స్పోర్ట్స్ చానల్‌తో పాటు జీ5 యాప్‌లో మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమ్ అవుతాయి. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు అర్ధరాత్రులు 12.30, 3.30 గంటలతో పాటు ఉదయం 6.30, 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. కొన్ని మ్యాచ్‌లు మాత్రమే రాత్రి 9.30, 10.30 గంటల నుంచి జరుగుతాయి.
3 ఈ మెగా టోర్నీకి మూడుసార్లు (1970, 1986, 2026) ఆతిథ్యమిచ్చిన తొలి దేశం మెక్సికో. 1994 తర్వాత అమెరికాకు ఇదే తొలి మెగా టోర్నీ కాగా, కెనడా తొలిసారి ఆతిథ్యం ఇస్తున్నది.
5 వరల్డ్ కప్‌లో బ్రెజిల్ అత్యధికంగా ఐదుసార్లు విజేతగా నిలిచింది. జర్మనీ, ఇటలీ చెరో నాలుగు కప్పులు గెలిచాయి.
26 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధికంగా 26 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ.
1245 ఈసారి ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 1,248 మంది ఆటగాళ్లు తమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో 891 మంది తొలిసారి మెగా టోర్నీలో ఆడుతున్నారు.
7 గతంలో విజేతలుగా నిలిచిన ఏడు జట్లు… ఉరుగ్వే, ఇంగ్లండ్, బ్రెజిల్, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, అర్జెంటీనా, ఈసారి కూడా బరిలో ఉన్నాయి.
17 ఈ టోర్నీలో ఆడుతున్న యంగెస్ట్ ప్లేయర్ 17 ఏండ్ల 240 రోజుల గిల్బర్టో మొరా (మెక్సికో). ఓల్డెస్ట్ ప్లేయర్ 43 ఏండ్ల 162 రోజుల క్రెయిగ్ గొర్డన్ (స్కాట్లాండ్)
2 మెగా టోర్నీలో ఇటలీ (1934,1938), బ్రెజిల్ (1958, 1962) మాత్రమే వరుసగా రెండుసార్లు విజేతలుగా నిలిచాయి. ఈసారి అర్జెంటీనా కప్పు నెగ్గితే మూడో జట్టు అవుతుంది.