న్యూఢిల్లీ, జూన్ 10: పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా జరిపిన వైమానిక దాడుల తర్వాత ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్, కువైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరపగా ఆ దేశాలు తమ గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలకం చేసి భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. జోర్డాన్‌లోని అల్-అజ్రాక్ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు కూడా ఇరాన్ ప్రకటించింది. అల్-అజ్రాక్ ప్రాంతం వైపు ఇరాన్ ప్రయోగించిన ఐదు క్షిపణులను అడ్డుకుని, కూల్చివేసినట్లు జోర్డాన్‌కు చెందిన సాయుధ దళాలు బుధవారం తెలిపాయి. అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు వైమానికి లక్ష్యాలను ఎదుర్కొంటున్నట్లు కువైట్ సైన్యం పేర్కొన్నది. హెచ్చరిక సైరన్లను మోగించినట్లు బహ్రెయిన్ మంత్రిత్వశాఖ నిర్ధారించింది. ఇరాన్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని బహ్రెయిన్ రాజు మీడియా సలహాదారు చెప్పారు.
ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తాం: ట్రంప్
ఇరాన్‌పై తమ దాడులు కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ రిపబ్లిక్ దాడులు చేస్తున్న క్రమంలో ఇరాన్‌పై మరిన్ని దాడులకు సంసిదులవుతున్నట్టు బుధవారం చెప్పారు. ఈసారి విద్యుత్తు ప్లాంట్లు, వంతెనలను లక్ష్యంగా దాడులు చేయాలని ఆదేశించనున్నట్టు తెలిపారని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. తమకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిన విషయాన్ని ట్రంప్ అంగీకరించారు. దౌత్య చర్చల ప్రయత్నాలు కనుక నిలిచిపోతూనే ఉంటే సైనిక దాడులను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన తెలిపారు. వారు బతికి బట్టకట్టడానికి ఒప్పదంపై సంతకం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హొర్ముజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ డ్రోన్‌తో కూల్చివేసిన క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.