భారతీరాజాను తమిళ ప్రజలు ‘ఇయక్కునార్ ఇమయం’ అని పిలుస్తుంటారు. అంటే ‘దర్శకుల్లో హిమాలయ శిఖరం’లాంటి వాడని అర్థం. భారతీరాజా సినీప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆ మాటల్లో ఏమాత్రం అతిశయోక్తిలేదనిపిస్తుంది. తమిళ సినిమా వ్యాకరణాన్ని పునర్నిర్వచించి, ఎక్కడో సెట్స్మాటున రంగులకలల్లో విహరిస్తున్న సినిమాను భూమార్గం పట్టించి మట్టి కథలను పరిచయం చేసిన దర్శక వైతాళికుడాయన. గ్రామీణ ప్రాంతపు కథల్ని, అక్కడి మట్టి పరిమళాలను, జీవన సౌందర్యాన్ని వాస్తవికత ప్రధానంగా కవితాత్మక శైలిలో ఆవిష్కరిస్తూ ఆయన తీసిన సినిమాలు ఆల్‌టైమ్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి.
సమాజం తాలూకు భిన్న సామాజిక పార్శాల్ని, మానవ సంబంధాల్లోని సున్నితత్వాన్ని, చీకటి కోణాల్ని మనోవిశ్లేషణాత్మక ధోరణిలో వెండితెర దృశ్యమానం చేసి విలక్షణ కథకుడిగా పేరు తెచ్చుకున్నారాయన. దక్షిణాది సినీ యవనికపై తనదైన ముద్రను వేసిన దర్శకదిగ్గజం భారతీరాజా (84) బుధవారం వేకువజామున చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భారతీరాజా అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తమిళనాడు సీఎం విజయ్ ప్రకటించారు.
భారతీరాజా అసలు పేరు చిన్నసామి పెరియమాయ తేవర్. 1941 జూలై 17న తమిళనాడు తేని జిల్లా అల్లినగరంలో జన్మించారు. సుప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి మీద ఆరాధనా భావంతో సినీరంగంలోకి వచ్చిన తర్వాతే తన పేరును భారతీరాజాగా మార్చుకున్నారు. బాల్యం నుంచి కళలు, కవిత్వం పట్ల అనురక్తి కలిగిన భారతీరాజా తొలుత కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కనగల్ వద్ద సహాయకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పి.పుల్లయ్య, ఎస్.కృష్ణన్ నాయర్, ఏ.జగన్నాథన్ వద్ద అసోసియేట్‌గా, కో డెరెక్టర్‌గా పలు చిత్రాలకు పనిచేశారు. నాలుగు భాషలకు చెందిన దిగ్దర్శకులతో పనిచేయడం వల్ల వారి సృజనాత్మక శైలి, భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించే విధానాలను సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్నారు.
1977కు ముందు తమిళ సినిమాలో ఎక్కువగా మూసధోరణి కనిపించేది. మెజారిటీ సినిమాలు స్టూడియోల్లోనే షూటింగ్స్ జరుపుకునేవి. ఆ సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ సినిమాలను పల్లెటూరి గడప ముందు నిలబెట్టారు భారతీరాజా. దర్శకుడిగా ఆయన తొలిచిత్రం ‘16 వయథినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ అయింది) సంచలనాన్ని సృష్టించింది. గ్రామీణ ప్రాంతంలోని లైవ్లోకేషన్లలో మొత్తం షూటింగ్ మొత్తం జరుపుకున్న తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది.
పల్లెజీవితాన్ని, అక్కడి వేషభాషలను యథాతథంగా ప్రేక్షకుల కళ్లముందుంచింది. ఎలాంటి మేకప్ హంగులు లేకుండా నటీనటుల్ని వారి సహజమైన వర్ణంలో చూపించే ట్రెండ్ కూడా ఈ సినిమాతోనే మొదలైంది. కమల్‌హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నాడు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. ఇదే చిత్రాన్ని ‘పదహారేళ్ల వయసు’ పేరుతో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేశారు. చంద్రమోహన్, శ్రీదేవి, మోహన్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగులో కూడా సంచలన విజయాన్ని సాధించింది.
‘16 వయథినిలే’ సంచలన విజయంతో తమిళనాట భారతీరాజా పేరు మార్మోగిపోయింది. ఆయన తదుపరి సినిమాకోసం ప్రేక్షకులు ఎదురుచూసేలా చేసింది. ఆ తర్వాత ఆయన తమిళంలో రాధికను కథానాయికగా పరిచయం చేస్తూ ‘కిళక్కే పోగుం రైల్’ (తూర్పు వెళ్లే రైలు) అనే సినిమా తీశారు. ఇందులో తెలుగు నటుడు సుధాకర్ హీరోగా నటించారు. గ్రామీణ నేపథ్యంలో కులవివక్షను ప్రశ్నిస్తూ, సంప్రదాయ భావాలకు ఎదురీదే ప్రేమికుల కథగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత తమిళంలో భారతీరాజా తీసిన ‘సిగప్పు రోజాక్కల్’ (ఎర్రగులాబీలు) కూడా అపూర్వ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అనంతరం భాగ్యరాజ్, రతి అగ్నిహోత్రి జంటగా రూపొందించిన ‘పుదియ వార్చుగల్’ చిత్రాన్ని భారతీరాజా తెలుగులో ‘కొత్త జీవితాలు’ పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో ఆయన తొలిచిత్రమిదే. ఈ సినిమా ద్వారా సుహాసిని తెలుగు తెరకు నాయికగా పరిచయమైంది. ఈ సినిమా కూడా గ్రామీణ కథే. ఊరిలోని భూస్వాముల ఆగడాలను, అవినీతిని ప్రశ్నిస్తూ వ్యవస్థలో మార్పు రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది.
కార్తీక్, రాధలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ తమిళంలో భారతీరాజా తీసిన ‘అలైగల్ ఒయివదిైల్లె’ చిత్రం తెలుగులో ‘సీతాకోక చిలుక’గా నిర్మాణం జరుపుకుంది. తెలుగు వెర్షన్లో కార్తీక్ కథానాయకుడిగా నటించగా, నాయికగా మాత్రం ముచ్చర్ల అరుణను పరిచయం చేశారు. మతాంతర ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. స్వచ్ఛమైన ప్రేమ మతం, కులం అడ్డుగోడల్ని దాటుకొని, సామాజిక కట్టుబాట్లను ఛేదించి విజయం సాధిస్తుందని ఈ సినిమా ద్వారా తెలియజెప్పారు. 80వ దశకంలో ఈ సినిమా యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఇళయరాజ స్వరపరచిన.. మాటే మంత్రము, మిన్నేటి సూరీడు వొచ్చేనమ్మా, సాగరసంగమమే, అలలు కలలు అనే పాటలు ప్రతీ ఇంట మార్మోగిపోయాయి. జంధ్యాల సంభాషణలు కూడా ప్రధానాకర్షణగా నిలిచాయి. తెలుగులో అద్భుత విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ఈ సినిమాలో మేకింగ్‌పరంగా ఎన్నో ప్రయోగాలు చేశారు భారతీరాజా. రౌండ్ట్రాలీలేని ఆ రోజుల్లో హీరోహీరోయిన్లపై తీసిన ఓ షాట్ సినిమాలోనే హైలైట్‌గా నిలిచింది.
భారతీరాజ తెలుగులో కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, యువతరం పిలిచింది, ఈతరం ఇల్లాలు, చిరంజీవితో ఆరాధన, సూపర్‌స్టార్ కృష్ణతో జమదగ్ని వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఆరాధన’ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేపోయినా సంగీతపరంగా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలోని ‘అరె ఏమైంది..’ అనే పాట ప్రజాదరణ పొందింది. భారతీరాజా తెలుగులో దర్శకత్వం వహించిన డైరెక్ట్ మూవీస్ కంటే రీమేక్స్, అనువాద చిత్రాలు మంచి విజయాల్ని సాధించాయి. భారతీరాజా తమిళంలో దర్శకత్వం వహించిన ‘కిళక్కే పోగుం రైల్’ అనే చిత్రాన్ని బాపు దర్శకత్వంలో ‘తూర్పు వెళ్లే రైలు’గా (1978)రీమేక్ చేశారు. ముళ్లపూడి వెంకటరమణ సంభాషణలు అందించారు. మోహన్, జ్యోతి జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది.
శివాజీగణేశన్, రాధతో రూపొందించిన ‘ముదల్ మారియాదై’ చిత్రం తెలుగులో ‘ఆత్మబంధువు’గా పునర్నిర్మాణం జరుపుకొని విజయం సాధించింది. ఇక భారతీరాజా దర్శకత్వంలో పాండ్యన్, రేవతి హీరోహీరోయిన్లుగా పరిచయమైన ‘మన్ వాసనై’ చిత్రం తెలుగులో బాలకృష్ణ కథానాయకుడిగా ‘మంగమ్మగారి మనవడు’ (1984) పేరుతో రీమేక్ అయి అపూర్వ విజయాన్ని సాధించింది. బాలకృష్ణ, సుహాసిని, భానుమతి రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల్ని మెప్పించింది. కృష్ణంరాజు, జగపతిబాబు నటించిన ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి భారతీరాజా స్క్రీన్‌ప్లే అందించారు. ఆయన తమిళంలో దర్శకత్వం వహించిన ‘కిళక్క సీమయిలే’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. తన శిష్యుడు భాగ్యరాజ అందించిన కథతో భారతీరాజ తీసిన ‘ఒరు ఖైదియన్ డైరీ’ తెలుగులో ‘ఖైదీవేట’గా డబ్బింగ్ జరుపుకొని సక్సెస్ అయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో కమల్‌హాసన్ ద్విపాత్రాభినయంలో నటించారు.
భారతీరాజా దర్శకత్వంతో పాటు నటుడిగా కూడా ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘ఆయుధ ఎళుతు’ ‘పాండియనాడు’ ‘తిరుచిత్రంబలమ్’ (తిరు), విజయ్ సేతుపతి ‘మహారాజా’, రామ్పోతినేని ‘ది వారియర్’, శింబు ‘ఈశ్వరుడు’ చిత్రాల్లో కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. మోహల్‌లాల్ ‘తుడరమ్’ చిత్రంలో ఆయన చివరిసారి తెరపై కనిపించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘పులవర్’ విడుదల కావాల్సి ఉంది. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో అవార్డులను అందుకున్నారు భారతీరాజా. వివిధ విభాగాల్లో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను స్వీకరించారు. ‘సీతాకోకచిలుక’ చిత్రానికిగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. నాలుగు ఫిలింఫేర్ అవార్డులతో పాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ విభాగాల్లో 6 అవార్డులను అందుకున్నారు. 2004లో భారతప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
భారతీరాజా తన సినిమాలకు ఎక్కువగా పల్లెటూరి నేపథ్యాన్నే ఎంచుకున్నారు. అక్కడి ప్రాకృతిక సౌందర్యాన్ని తెరపై చూపిస్తూ, అమాయకులైన గ్రామీణులు, వారి జీవన సంఘర్షణను ఇతివృత్తాలుగా తీసుకొని అద్భుత చిత్రా ల్ని తెరకెక్కించారు. కెరీర్ ఆరంభంలో కేవలం గ్రామీ ణ నేపథ్య చిత్రాలు తీస్తారనే పేరు రావడంతో దానిని బ్రేక్ చేస్తూ ‘సిగప్పు రోజాక్కల్’ ’(ఎర్రగులాబీలు) అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా తీశారు. కమల్‌హాసన్, శ్రీదేవి నటించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా అద్భుత విజయాన్ని సాధించింది. ఆ తర్వాత భారతీరాజా ‘నిళల్గల్’ ‘టిక్ టిక్ టిక్’ వంటి విభిన్న కథా చిత్రాలతో బహుముఖప్రజ్ఞను చాటుకున్నారు. అయితే గ్రామీణ కథావస్తువులే దర్శకుడిగా ఆయనకు కీర్తిప్రతిష్టల్ని తెచ్చిపెట్టాయి. పల్లెటూరి ప్రేమకథలతో పాటు సాంఘిక అసమానతలు, కుల వివక్షణ చర్చిస్తూ సామాజిక ప్రయోజనాత్మక చిత్రాలతో దర్శకుడిగా దక్షిణాది సినిమాపై తనదైన సంతకాన్ని లిఖించారు భారతీయరాజా.