హైదరాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో శుక్రవారం నుంచి జ్వర సర్వే ప్రారంభమైంది. ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, ప్రజలందరీ ఆరోగ్య వివరాలను ఆరోగ్య శాఖ సేకరిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి తక్షణమే కొవిడ్ కిట్‌ను అందజేస్తున్నారు. కోటి కొవిడ్ కిట్లను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు అధికారులు పంపారు. కిట్‌లో అజిత్రో మైసిన్, పారాసిటమాల్, లెవో సిట్రిజన్, రానిటిడైన్, విటమిన్ సీ, డీ మెడిసిన్స్ తో పాటు మల్టీ విటమిన్ ట్యాబెట్లను అందజేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో జ్వర సర్వేను పూర్తి చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా నుంచి ప్రజలను కాపాడుకొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఈ మేరకు థర్డ్‌వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్న విషయం తెలిసిందే. మంత్రి హరీశ్‌రావు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకొంటున్న చర్యలు, వ్యాక్సినేషన్, థర్డ్‌వేవ్ సన్నద్ధత తదితర అంశాలపై సమీక్షించారు.
అనంతరం మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించామన్నారు. కొవిడ్ వ్యాప్తిని ముందుగానే కట్టడి చేసేందుకు జ్వర సర్వే నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. శుక్రవారం నుంచి ఫీవర్ సర్వే ప్రారం భం అవుతుందని తెలిపారు. ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తారని చెప్పారు. ఎవరికైనా లక్షణాలుంటే అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్ ఇస్తారని, వైద్య సిబ్బంది వారి ఆరోగ్యాన్ని రోజూ పరిశీలిస్తారని తెలిపారు. అవసరమైతే వారిని సమీప ప్రభుత్వ దవాఖానకు తరలిస్తారని చెప్పారు. ఎలాంటి లక్షణాలు లేకపోతే కొవిడ్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తారని తెలిపారు. హోం ఐసొలేషన్ కిట్లలో వాడే కొన్ని మందులు ప్రస్తుతం బయట దొరకటం లేదని, టెస్టింగ్ కిట్లకు కూడా కొరత ఉన్నదని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్త ఫలితంగా మనం అన్నింటినీ ముందే సమకూర్చుకోగలిగామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోటి ఐసొలేషన్ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు సమకూర్చుకొన్నామని వెల్లడించారు. వీటిని పీహెచ్సీ స్థాయికి పంపిణీ చేశామన్నారు.