భ్రూణహత్యలు అరికట్టడంలో షీ టీమ్స్ సఫలీకృతం
ఆడశిశువులకు కొండంత అండ
మూడేండ్లలో 6800 ప్రాంతాల్లో 18 లక్షల మందికి అవగాహన
చట్టవిరుద్ధమైన పనులు చేసే స్కానింగ్ సెంటర్లపై కొరడా
గర్భిణి సిబ్బందితోనే డెకాయ్ ఆపరేషన్లు
‘లింగ నిర్ధారణ’కు చెక్
మహిళల్లోనూ పెరిగిన చైతన్యం
అబార్షన్లు పూర్తిగా తగ్గిన వైనం
సిటీబ్యూరో, డిసెంబర్ 26 : గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చిదిమేయడం హేయమైన చర్యే. కానీ అనేక గ్రామాలు, తండాల్లో భ్రూణ హత్యలు నిరంతరం కొనసాగేవి. ఏదో ఒక చోట ఆడ శిశువు ప్రాణం పోసుకుందని తెలిస్తే.. చాలు అంతలోనే అంతమొందించేవారు. ఈ ఆటవిక సాంస్కృతిని అరికట్టడంలో షీటీమ్స్ సఫలీకృతమైంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు ‘అబార్షన్’ అనే మాట వినపడటం లేదు. గుట్టుచప్పుడుగా గర్భస్రావాలు చేసే.. కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతుండటంతో ఏ శిశువైనా మాకు ఒకటేనన్న భావన మహిళల్లోనూ వచ్చింది. డీసీపీ సలీమా ఆధ్వర్యంలో 2018 నుంచి మొదలుపెట్టిన స్పెషల్ డ్రైవ్.. వారిలో చైతన్యం తీసుకొచ్చింది. మరోవైపు ఏ వైద్యుడు కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సాహసించడం లేదు. ఎవరైనా చట్టవిరుద్ధమైన పనులు చేస్తే.. తాట తీస్తున్నారు.
గతంలో రోజుకు..
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో అధికంగా గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో షీ టీమ్స్ అధికారులు పర్యటించినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా కుటుంబాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేసుకొని.. ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్లు చేసుకుంటున్నారని తెలుసుకున్నారు. ఇలా రోజుకు 5 నుంచి 10 అబార్షన్లు జరుగుతున్నట్లు గుర్తించారు. ఎందుకిలా చేస్తున్నారనే సమాచారాన్ని సేకరించారు. హైదరాబాద్ నుంచి అనేక మంది వైద్యులు మొబైల్ సర్వీసుల ద్వారా అబార్షన్లు చేసి…బాగా డబ్బులు దండుకుంటున్నట్లు తేలింది. మరికొందరు డయాగ్నోస్టిక్స్ సెంటర్ల ముసుగులో లింగ నిర్ధారణ టెస్టులు నిర్వహించి… గర్భస్రావం చేస్తున్నారని గుర్తించారు.
అవగాహన కల్పించి.. చైతన్యపరిచి..
భ్రూణ హత్యలు అరికట్టేందుకు రంగంలోకి దిగిన షీటీమ్స్ డీసీపీ సలీమా ఆధ్వర్యంలో సిబ్బంది 2018 నుంచి సుమారు 6800 ప్రాంతాల్లో 18 లక్షల మందికి అవగాహన కల్పించారు. ‘లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధం.. అలా చేస్తే జైలుకు వెళ్తార’ని..అబార్షన్ చేసుకుంటే ప్రాణానికి ప్రమాదమని హెచ్చరించారు. దాని దుష్పరిణామాలు భవిష్యత్‌లో ఆరోగ్యంపై చూపుతుందని.. మహిళలకు ప్రత్యేక చట్టాలు, హక్కులు ఉన్నాయని అవగాహన కల్పించడం మొదలుపెట్టారు. స్కూళ్లు, కాలేజీలు, వ్యవసాయ క్షేత్రాలు..అలా ఎక్కడ మహిళలు కనిపిస్తే.. అక్కడ షీ టీమ్స్ వెళ్లి.. లింగ నిర్ధారణ పరీక్షలు వద్దని, ఆడ, మగ శిశువు ఎవరైనా సంతానమేనంటూ చెప్పారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగించి.. గ్రామాలు, తండాల్లో అతివల్లో చైతన్యం తీసుకురాగలిగారు. మరోవైపు లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. అలా సుమారు 10కి పైగా కేంద్రాలను జప్తు చేయడమే కాకుండా 9 మంది ఎంబీబీఎస్ అర్హత ఉన్న వైద్యులను అరెస్టు చేసి..జైలుకు పంపారు. వారిపై అభియోగాలను నమోదు చేసి.. పూర్తి ఆధారాలను సేకరించారు. దీంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఏ ఒక్కరూ లింగ నిర్ధారణ చేస్తామనే మాట కూడా ఎత్తడం లేదు.
గుట్టుగా తెలుసుకొని…
లింగ నిర్ధారణ చేస్తున్న కేంద్రాలను గుర్తించేందుకు డీసీపీ సలీమా మహిళా సిబ్బందినే రంగంలోకి దించారు. గర్భిణులతోనే ఆ కేంద్రాలకు పంపించి.. ఆరా తీశారు. దాదాపు 2-3 నెలల పాటు అక్కడికి పంపిస్తూ.. గుట్టును బయటపెట్టారు. ఆడ పిల్ల అనగానే అబార్షన్ చేస్తున్న మూడు సూపర్ స్పెషల్ దవాఖానలను మూసివేయించారు. ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, మేడిపల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోని వైద్యులు, డయాగ్నోస్టిక్ కేంద్రాల దొంగ చాటు వ్యవహారాలను బహిర్గతం చేశారు. ఓ సందర్భంలో డీసీపీ సలీమా కూడా ఆ కేంద్రాల వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తున్నట్లు, కిరాణా దుకాణల వద్ద మాటు వేసి.. లింగనిర్ధారణ చేసే వారి సమాచారాన్ని సేకరించారు.
చాలా ఆనందంగా ఉంది
మహిళా భద్రతకు ఏర్పడ్డ షీ టీమ్స్..వారి రక్షణకే కాకుండా చట్టపరంగా వారికి ఉన్న హక్కులు, చట్టాలపై గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యాన్ని కల్పించాం. దీంతో మహిళలు అబార్షన్‌కు దూరంగా ఉంటున్నారు. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. 2018 నుంచి చేసిన ప్రయత్నంతో ఇప్పుడు గ్రామీణ మహిళలు అబార్షన్ అంటేనే వద్దనే స్థితికి తీసుకువచ్చాం. అలాగే అక్రమంగా గర్భస్రావాలు చేసి అతివల జీవితాలతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
– సలీమా, డీసీపీ, రాచకొండ షీ టీమ్స్
రెండేండ్ల జైలు..గుర్తింపు రద్దు
గర్భంలోనే లింగ నిర్ధారణ పరీక్షలను చేయించుకొని..ఆడ శిశువు అని తెలియగానే అబార్షన్ చేసుకునేందుకు మొగ్గు చూపే ఆలోచనను 95 శాతం మార్చేశాం. ఇందుకోసం ప్రతి రోజూ షీ టీమ్స్ బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించి..చైతన్యవంతులను చేస్తున్నాం. మూడేండ్లలో పోలీసు కమిషనరేట్ పరిధిలో ఒక్క అబార్షన్ కూడా జరుగలేదు. ఎవరైనా గర్భస్రావం చేస్తే.. పీసీపీఎన్డీటీ యాక్ట్ కింద అభియోగాలను నమోదు చేస్తున్నాం. విచారణలో తేలితే.. నిందితులకు రెండేండ్ల జైలు…వారి దవాఖాన గుర్తింపు రద్దు అవుతాయి.
– మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్