రవీంద్రభారతి,అక్టోబర్ 15: రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల రూ. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 48 గంటల్లోపు చెల్లించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రైవేట్ కాలేజీల నిరవధిక బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆయన మాట్లాడారు. ఫీజుల కోసం తెలంగాణ ప్రైవేట్ కాలేజేస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు 1000 డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయని, ఇది తొలిసారి అని, ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు.ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యలో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు జీతాలు తీసుకోవడం లేదా అని, విద్యార్థుల చదువులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 22న విద్యార్థి సంఘాలు ఇచ్చిన కలెక్టరేట్ల ముట్టడి జయప్రదం చేయాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఫీజు బకాయిలు ఇచ్చే వరకు బందులు, నిరసనలు, ధర్నాలు కొనసాగుతాయని సీఎం రేవంత్‌రెడ్డి బేషజాలకు పోకుండా బకాయిలు విడుదల చేయాలన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ విద్యార్థులకు అన్ని విధాలు చేయూతనిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇప్పుడు ఎక్కడికి పోయిండని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు కూడా చేయడంలేదన్నారు. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని చూసి ఎవరూ ఓటువేయలేదని, విద్యార్థులు, నిరుద్యోగులు కలసి కాంగ్రెస్‌కు ఓటువేశారని ఇది గుర్తుంచుకొని సీఎం రేవంత్‌రెడ్డి పాలన కొనసాగించాలని సూచించారు. నీకు పరిపాలించ చేతకాకుంటే మరొకరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించాలని , లేకుంటే నిరవధిక ధర్నాలు, బందులు, రాస్తారోకోలతో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో వేముల రామకృష్ణ, అధ్యక్షత వహించగా, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్నేతలు, జెల్లపల్లి అంజి, పరమేశ్వర్, రామకృష్ణ, సుభాశ్ రెడ్డి, నర్సింహయాదవ్ పాల్గొన్నారు.