ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని రెవంత్‌రెడ్డి సర్కారు.. ఇంటర్ విద్యార్థులపై మాత్రం ఫీజు భారం మోపింది. నిరుటితో పోల్చితే ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్ష ఫీజును అదనంగా రూ.110కు పెంచింది. ఇది పేద విద్యార్థులకు ఆర్థిక భారంగా మారింది. ఎటువంటి ల్యాబ్ అవసరం లేని ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పేరిట ప్రత్యేకంగా రూ.100 చొప్పున వసూలు చేస్తోంది. పెరిగిన ఫీజుతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 18,218 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో చదువుకునే స్థోమత లేక ప్రభుత్వ కాలేజీల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులపై అదనపు భారం మోపడం గమనార్హం.
అశ్వారావుపేట, నవంబర్ 6: ఈ ఏడాది పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు.. ఫీజులు పెంచి విద్యార్థులపై ఆర్థిక భారం మోపింది. ఇందుకు గాను ఫీజు చెల్లింపునకు గడువు నిర్దేశించింది. నవంబర్ 1 నుంచి 14 వరకు జూనియర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజును చెల్లించాలని ఆదేశించింది. రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 24 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 వరకు, రూ.1,000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 వరకు, రూ.2,000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది.
ఈ ఏడాది పరీక్ష ఫీజు పెంపుతో ఒక్కో విద్యార్థిపై అదనంగా రూ.110 భారం పడుతోంది. నిరుడు కూడా ప్రభుత్వం రూ.20 ఫీజు పెంచింది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఉన్న 45 జూనియర్ కాలేజీల నుంచి 18,218 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 14 ప్రభుత్వ, 31 ప్రైవేట్ కాలేజీల నుంచి మొదటి సంవత్సరంలో 8,997 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 9,221 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
పరీక్ష ఫీజు రూ.110 పెంపు..
ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజును కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. దీనికి అనుగుణంగా ఇంటర్మీడియట్ బోర్డు ఫీజు చెల్లింపునకు గడువు నిర్దేశించింది. గత ఏడాది రూ.20 పెంచిన ప్రభుత్వం.. ఈ ఏడాది ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పేరుతో అదనంగా రూ.100 వసూలు చేస్తోంది. అలాగే ఆర్ట్స్, సైన్స్ కోర్సుల ఫీజు రూ.520 ఉండగా.. ఈసారి రూ.530కి పెంచింది. దీని ప్రకారం ఒక్కో విద్యార్థి పరీక్ష ఫీజు రూ.630 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఒక్కో విద్యార్థిపై పెరిగిన ఫీజు భారం రూ.110కు చేరింది. గత ఏడాదితో పోల్చితే రూ.130కి చేరుతుంది. సెకండియర్ ఆర్ట్స్ విద్యార్థులు కూడా ఫీజు రూ.630 చెల్లించాలి.
సెకండియర్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థులు రూ.870 ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో పరీక్ష ఫీజు రూ.530 కాగా.. ప్రాక్టికల్స్ ఫీజు రూ.240. దీంతోపాటు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌కు రూ.100 చొప్పున ఫీజు ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో 40 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారే ఉన్నారు. వీరిపై సుమారు రూ.8 లక్షలకు పైగానే ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పెంపు రూ.కోట్లకు చేరుతుంది. ఎటువంటి ల్యాబ్ అవసరం లేకున్నా ప్రభుత్వం ప్రాక్టికల్స్ పేరుతో ఇంగ్లిష్‌కు అదనంగా రూ.100 చొప్పున వసూలు చేయడం పేద విద్యార్థులకు కచ్చితంగా ఆర్థిక భారమే అవుతుందని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో చదివించుకోలేని నిరుపేద తల్లిదండ్రులు ఫీజుల భయంతో ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
పెంచిన ఫీజు తగ్గించాలి..
ప్రభుత్వ కాలేజీల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని.. పెంచిన పరీక్ష ఫీజును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యకు పెద్దపీట వేస్తున్నామని ప్రచారం చేసుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజును పెంచడం సరికాదు. అసలు ల్యాబ్ అవసరం లేని ఇంగ్లిష్‌కు ప్రాక్టికల్స్ పేరుతో ఫీజు వసూలు చేయడం విడ్డూరం.
-జూపల్లి దుర్గాప్రసాద్, బీఆర్ఎస్వీ నాయకుడు, కొత్తగూడెం
ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకే..
ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకే జూనియర్ కాలేజీలు పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నాయి. ఈ ఏడాది ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ కోసం ప్రత్యేకంగా రూ.100 ఫీజును బోర్డు నిర్ణయించింది. దీని ప్రకారం నిర్దేశించిన గడువులోగా విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఫైన్‌తో మరింత గడువు కూడా ఇచ్చింది.
-హెచ్.వెంకటేశ్వరరావు, డీఐఈవో, కొత్తగూడెం