ఖమ్మం, నవంబర్ 6: లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) అధికారులకు ఖమ్మం ఇన్చార్జి కలెక్టర్, కేఎంసీ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ శ్రీజ సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కేఎంసీలోని వివిధ విభాగాల అధికారులతో ఖమ్మంలోని కేఎంసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఖమ్మంలోని అన్ని షాపులనూ తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. లైసెన్స్‌లేని షాపులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ప్రతి డివిజన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో శానిటేషన్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ పనులు చేసే ముందు, చేసిన తరువాత ఫొటోలు తీసి రిపోర్టులు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. రోడ్డు విస్తరణ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ యోజనకు జియో ట్యాగింగ్ పనులను పూర్తి చేయాలని, టాక్స్ కలెక్షన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఫారెస్ట్ కార్యాలయం వెనుక ఓపెన్ డ్రైన్ సమస్యను తక్షణమే పరిషరించాలని సూచించారు. అనంతరం, ఆయా విభాగాల పనితీరును, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు.