తాండూరు రూరల్, డిసెంబర్ 16 : తాండూరు పట్టణ, మండల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు మండలంలోని అంతారం, పెద్దేముల్ మండలం గొట్లపల్లి అటవీ ప్రాంతంలో 110 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్కు పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపుగా 11 నెలల క్రితం రూ. 4.50 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ పార్కు పనులను తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రారంభించారు. అవసరమైన స్థలాన్ని అటవీశాఖ అధికారులు సమకూర్చి, ఇప్పటివరకు రూ.1.50 కోట్లతో పార్కు చుట్టూ ఫెన్సింగ్, 3.5 కిలోమీటర్ల దూరం వాకింగ్ ట్రాక్ పనులను వారు పూర్తి చేశారు. మిగితా పనుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. పార్కు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అటవీశాఖ అధికారులు అందులో పలు రకాల పూ లు, పండ్ల్లు, నీడను ఇచ్చే మొక్కలను నాటి సంరక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పార్కు పనులు పూర్తయితే తాండూరు పట్టణ ప్రజలతోపాటు రూరల్‌లోని అన్ని మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్‌తోపాటు చిన్నపిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆటవస్తువులు, వివిధ రకాల బొమ్మలు, బెంచీలను ఏర్పాటు చేయనున్నారు. పార్కుకు వచ్చే వారికి ప్రశాంత వాతావరణం కల్పించేలా పనులు జరుగుతున్నాయి. తాగునీటి వసతి కోసం బోరు తవ్వించాలని నిర్ణయించారు.
మిగిలిన పనులకు రూ.3 కోట్లతో ప్రతిపాదనలు
పార్కులో మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేసేందుకు మరో రూ.3 కోట్ల నిధులకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించినట్లు తాండూరు అటవీ శాఖ అధికారి శ్యాంప్రసాద్ తెలిపారు. నిధులు మం జూరు కాగానే మిగిలిన పనులను త్వరగా పూర్తి చేస్తామని, జిల్లాలోనే పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అదేవిధంగా పార్కులో గజీబో ఏర్పాటు చేస్తామన్నారు. దానిపైకి ఎక్కి చూస్తే పార్కు ఏరి యా మొత్తం కనబడుతుందని ఆయన తెలిపారు.