వరంగల్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలైన సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘విజయగర్జన సభ’కు అంతా సిద్ధమవుతున్నది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పక్కన ఈ సభ నిర్వహణకు అక్కడి రైతులు అంగీకరించారు. విజయగర్జన సభ కోసం అవసరమైన 130 ఎకరాల ను తాత్కాలికంగా వినియోగించుకోవచ్చని చెప్పారు. శుక్రవారం దేవన్నపేట రైతులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను కలిసి అంగీకార పత్రాలు అంద జేశారు. సభ నిర్వహణకు తాత్కాలికంగా భూములు ఇస్తున్నందున తమకు ఇబ్బందులేమీ లేవని రైతులు తెలిపారు. తమ భూముల్లో సాగు చేసిన పంటల కోతలు పూర్తయ్యాయని వారు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ దేవన్నపేట రైతులను అభినందించారు.