హనుమకొండ సబర్బన్, జూలై11 : గతంలో ఎన్నడూ లేని రీతిలో పంట పొలాలు కూలీలను వెక్కిరిస్తున్నాయి. యేటా వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా ఉండే వారు ఇప్పుడు పనులు లేక పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమయానికి ప్రతి సంవత్సరం ముమ్మరంగా సాగు పనులు సాగుతాయి. రైతులు కూలీలను బతిమిలాడే పరిస్థితి ఉంటుంది. ఇదే అదనుగా కూలీలు సైతం తమకు నచ్చినట్లు పైకం ఇస్తేనే పనికి వస్తామని డిమాండ్ చేసే స్థాయిలో ఉండేది.
అలాంటి స్థితి నుంచి ఇంటి నుంచి బయటకు కాలు కూడా పెట్టలేని కరువు నెలకొంది. వొడ్లు చెక్కడం మొదలు, గొర్రు కొట్టడం, ఎరువులు చల్లడం లాంటి పనులు పురుషులు చేస్తే, నాట్లు వేయడం లాంటి పనులు మహిళలు చేస్తారు. ఈ పనులు జూన్ ప్రథమార్థం మొదలు కుని జూలై చివరి వరకు కొనసాగేది. దీంతో కూలీలు ఆరు నెలల గాసం సమకూర్చుకునేది. తరి పంటల్లో ఇలా ఉంటే ఖుష్కి పంటల్లో విత్తనాలు వేయడం మొదలుకుని, కలుపులు తీయడం, గుంటుకలు తోలడం, ఎరువులు వేయడం లాంటి పనులు చేస్తూ కూలీలు మునుపెన్నడూ లేని స్థాయిలో కరువును ఎదుర్కొంటున్నారు.
రూపాయి పని లేకుండా పోయింది. అరకొర పనులు ఉంటున్న ఆసాములు ఇచ్చిన కాడికి తీసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు 61 శాతం లోటు వర్షపాతం నెలకొనడంతో కరువు విలయతాండవం చేస్తుంది. కాకతీయ కాల్వ కింద బావులు ఉన్న రైతులు కూడా పూర్తి స్థాయిలో నాట్లు వేయకుండా సగం మేరకే సరి పుచ్చుకుంటున్నారు. పొలాలు దున్నేందుకు ట్రాక్టర్లకు కూడా గిరాకీ లేక విలవిల్లాడుతున్నారు. గొర్రు కొట్టేందుకు లక్షలు వెచ్చించి ఎడ్లు కొనుక్కున్న రైతులు మిత్తి పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
వ్యవసాయ పనులు లేకుంటే ప్రత్యామ్నాయంగా ఉపాధి హామీ పనులు ఉండేవి. ఇవి కూలీలకు కొంత మేరకు స్వాంతన చేకూరేది. అంతకు ముందు కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు భరించేది. ఇప్పుడు ఆ నిష్పత్తి కాస్తా 60 శాతం 40 శాతానికి చేరింది. దీంతో అసలే అన్ని ఎగ్గొట్టే ప్రయత్నాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది భారంగా మారిపోయింది. ఎట్లా పనులు తగ్గించాలనే పన్నాగంలో ఉంది. పొమ్మనలేక పొగ బెట్టినట్లు పనులను సామర్థ్ధ్యానికి మించి చెబుతుండడంతో డబ్బులు తక్కువగా వస్తుండడంతో ఫాయిదా లేదని కూలీలే ఊకుండే పరిస్థితి నెలకొంది.
కాలం మంచిగైతే వానకాలం, యాసంగి రెండు మూణ్నెల్లు నాట్లకు పోయోటోళ్లం. మా బ్యాచ్ మొత్తం పొద్దుకొట్టంగ బొయ్యి, పొద్దు వంగినంక వచ్చేది. ఆసాముల దగ్గర గుత్తలకు మాట్లా డుకొని నాట్లు ఏసెటోళ్లం. గట్లయితెనే మాకు నాల్రూపాయలు కనబడేది. వానలు పడితే ఆసాములు ఓ పని కాకపోతె మరోటి చెప్పేది. పత్తులు కలుసుడు, పత్తులు ఏరుడు, మక్కలు కలుసుడు, పొట్టు తీసుడు పనులు ఉండెడిది. గిప్పుడు వానలు లేక పనుల మొత్తం బందయిన యి. యాడాదంత కొసెళ్లుడు ఎట్లనో.
– ఎల్లమ్మ, రైతు కూలి, ఎల్కతుర్తి
నేను ప్రతి వర్షాకాలంలో ఇర వై ఎకరాల్లో వరి నాట్లు వేస్తా ను. సుమారు ఇరవై రోజుల పా టు కూలీలు నా పొలంలో రకరకాల పనులు చేస్తుంటారు. ఈసారి మాత్రం వర్షాలు లేకపోవడం వల్ల పూర్తి తలకిందులై పోయింది. సగం వరకే నాట్లు వేస్తున్నాను. అది కూడా కొసెళ్లుడు డౌటు గానే ఉంది. ప్రతి సీజన్‌కు నా లుగు గ్రూపులు ఇతర రాష్ట్రల కూలీలను నాట్లు వేసేందుకు తీసుకొ చ్చేది. ఈసారి ఒక్క గ్రూపునే తీసుకువచ్చిన. వారికి కూడా సరైన పని చూపించలేకపోతున్న.
– పొలాడి సుధాకర్ రావు, రైతు, సూరారం
నేను ప్రతి పంటకు గొర్రు కొట్టడానికి పోతాను. రోజు రూ. మూడు వేలు వచ్చేది. గిట్ల నెల రోజులు నడిచేది. అదే ఆశతో ఈసారి కూడా ఉంటుందని పాత ఎడ్లను తీసేసి ఇంకో రూ. లక్ష అప్పు చేసి కొత్త ఎడ్లను కొన్న. వాన కాలం మొదలైనప్పటి నుంచి ఒక్క ఎకరం సుత గొర్రు కొట్టలే. పత్తి చేన్లల్ల గుంటుకలు కొడుదామన్న వానలు లేక పత్తులు సుత ఎక్కువగ పెట్టలే. పెట్టిన పత్తులు కూడా నీళ్లు లేక వళ్లి పోతున్నయి. మాకు అప్పులు మీద పడేటట్లున్నయి.
– పోలు కిట్టు, రైతు, ఎల్కతుర్తి