మిత్తీల బాధలేదు.. సేట్ల వేధింపుల్లేవు
నాడు ఎవుసమంటే భయం.. నేడు భద్రత
రంగారెడ్డి, నిజామాబాద్ రైతుల మనోగతం
రాష్ట్ర రైతుల జీవితాలను రైతుబంధు పథకం సమూలంగా మార్చేసింది. ఆయిటికాలం వస్తుందంటే అప్పులకోసం షావుకార్లు, వడ్డీవ్యాపారుల వద్దకు పరుగులు తీసే అవసరం తీరిందని రైతన్నలు సంతోష పడుతున్నారు. ప్రభుత్వం ఠంచన్‌గా బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి 5 వేలచొప్పున ఏటా రెండుసార్లు రైతుబంధు డబ్బులు వేస్తుండటంతో నిశ్చింతగా వ్యవసాయం చేసుకొంటున్నామని చెప్తున్నారు.
రంగారెడ్డి, డిసెంబర్ 30 : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మోత్కులగూడెంకు చెందిన రైతు జెట్ట హన్మయ్యకు మూడెకరాల భూమి ఉన్నది. రైతుబంధు ప్రారంభానికి ముందు ఆయన ఏటా వ్యవసాయానికి వడ్డీ వ్యాపారులవద్ద అప్పు చేసేవారు. వడ్డీ అధికంగా ఉండటంతో తీరా పంట చేతికొచ్చాక అప్పులు పోను ఏమీ మిగిలేదికాదు. దాంతో వ్యవసాయం చేయాలంటేనే భయంవేసేదని హన్మయ్య తెలిపారు. ‘ఒకప్పుడు పంట చేతికొచ్చిందనే సంతోషం తప్ప పైసలు రాకుండే. తెచ్చిన అప్పులకు మిత్తి కట్టనీకె, మాకు తిననీకె సరిపోతుండే. వానకాలం వస్తుందంటే మా ఊరు పటేల్ దగ్గరికి అప్పుల కోసం పోతుంటిమి. పంట చేతికొచ్చే సమయానికి మిత్తి, అసలు కట్టినంక, మిగిలిన పైసలు తిననికే ఐతుండె. పైసలులేక మా కుటుంబమంతా పస్తులున్న రోజులున్నయ్. అప్పుడు మా కష్టాలను ఎవ్వరూ పట్టించుకోలే.
వ్యవసాయంచేస్తే అప్పులే తప్ప పైసలు మిగలవనుకున్నం. కానీ కేసీఆర్ సార్ వచ్చినంక మా సంసారాలు సక్కబడ్డయ్. వ్యవసాయంలో కొన్ని పైసలు మిగులుతున్నయ్. నాకున్న మూడెకరాల్లో వానకాలంలో పత్తి, యాసంగిలో కూరగాయలు సాగు చేస్తున్న. రైతుబంధుతో నా అప్పుల బాధలన్నీ పోయినయ్. చేత్తో రూపాయి పెట్టుబడి పెట్టకుండానే పంట చేసుకుంటున్నా. రెండు పంటలతో ఏటా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు చేతికొస్తున్నది. సీఎం సారు దయతో రైతుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నయ్. కేసీఆర్ సారు సల్లగుండాలె. మా ఊర్ల ఎవరు సచ్చిపోయినా రైతుబీమా పైసలు ఇచ్చి ఆదుకొంటుండ్రు. అప్పట్ల కరెంట్ ఎప్పుడొస్తదని ఎదురుచూసేటోళ్లం. ఇప్పుడు కరెంటు పోవుడే లేదు. మా ఊర్ల అప్పుడంతా చెత్త చెదారం ఉంటుండె. ఇప్పుడు సూద్దామన్నా చెత్త కనపడ్తలే. రోడ్లు వేసిండ్రు, పాయఖానాలు కట్టించిండ్రు, మా చేన్ల ఏ పంట ఏస్తే మంచిగయితదో ఎవుసం సార్లు వచ్చి చెప్తున్నారు’ అని సంతోషం వ్యక్తంచేశారు.
సగర్వంగా సాగు
డిచ్పల్లి, డిసెంబర్ 30: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు జైకుమార్‌కు స్వగ్రామంలో రెండున్నర ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఖాతాలో ప్రభుత్వం బుధవారం రూ.12,500 రైతుబంధు సాయం జమచేసింది. ఈ డబ్బుతో యాసంగి పంటవేసేందుకు జైకుమార్ సిద్ధమవుతున్నారు. ‘అప్పట్లో పంట వేయాలంటెనే భయం వేసేది. చేతిలో నయా పైసా ఉండకుండె. ఎవరైనా సేటు ఆదుకుంటేనే గట్టెక్కేది. అధిక మిత్తీకి పైసలు తెచ్చేటోళ్లం. పంటలు పండినాక అసలు, మిత్తీకే సరిపోతుండె. ఒక్కోసారి సేట్లు కూడా పైసలు ఇచ్చేటోళ్లు కాదు. ఎన్నో మాటలు అనేటోళ్లు. తెలంగాణ వచ్చినంక రైతుల పరిస్థితి మారింది. ఎవరూ చేయని ధైర్యం కేసీఆర్ సారు చేసిండు. విత్తనాలు, ఎరువులు కొనడానికి, కూలీల ఖర్చు.. ఇలా అన్నింటికి పనికొచ్చేలా రైతుబంధు ఇస్తున్నడు. అప్పుల తిప్పలు తప్పినయ్. పేద రైతులను రైతుబంధు పైసల్ చానా ఆదుకొంటున్నయ్. ఇంతటి మేలును ఏ రైతూ మరిచిపోతడు. కేసీఆర్ సారు సల్లగా ఉండాలె’ అని అన్నారు.