తాండూర్ : దేశానికి వెన్నముకైన అన్నదాతల ( Farmers ) పరిస్థితి దైన్యంగా మారుతుంది. నారు వేసిన నాటి నుంచి పంట ఇంటికొచ్చేంత వరకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వాల వద్ద ముందుచూపు కొరవడడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా రైతుల వద్దకు ఎరువులు చేరడంలేదు. ప్రభుత్వం అరకొరగా పంపిస్తున్న యూరియా ( Urea ) కోసం పంపిణీ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు పడిగాపులు కాస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ చేతకానితనం వల్లే తిప్పలు తప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాండూర్ ( Tandoor ) మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో మంగళవారం రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. కార్యాలయానికి కేవలం 260 బస్తాలు వచ్చాయని సమాచారం అందడంతో తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్ సొసైటీ వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు వరుసకట్టారు. తీరా ఒక్కొక్కరికీ రెండు బస్తాల చొప్పున పంపిణీ చేయడంతో అసహనానికి గురై ఆందోళనకు దిగడంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి చేరుకొన్న పోలీసులు రైతులతో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చేశారు. వరుస క్రమంలో ఉన్న వారికే ఎరువులను పంపిణీ చేస్తామని తేల్చి చెప్పడంతో రైతులు క్రమపద్ధతిలో నిల్చొని ఎరువులకు సంబంధించిన చిట్టీలను తీసుకున్నారు.