వరంగల్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఈ పంట పండిచ్చుడెందుకు? పండీయకెందుకు? ఎండకు మలమలమాడుతున్నం. ఎండ పండ్లు తింటూ కొనేటోని కోసం కొండకు ఎదురుచూసినట్టు సూత్తున్నం. ఆకలిలేదు.. దూపలేదు. నోరెండిపోతున్నది. ఇయ్యాటికి 20 రోజులుగా ఇదే అరిగోస పడుతున్నం’ ఇదీ.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ద్వారకపేట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఓపెన్ ప్లాట్‌లో వడ్లు ఆరబోసి కుప్పనూరుస్తున్న ఓ మహిళా రైతు ఆవేదన.
కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నదంతా ఉత్తడొల్ల అని ఈ ఘటనను చూస్తేనే తెలుస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని రూఢీ అవుతున్నది. ‘ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినం. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లను వచ్చినట్టు కొంటున్నం. ఇప్పటికే 80 శాతం ధాన్యం కొన్నం.
కేంద్రాల్లో రైతులకు సకల సౌకర్యాలు కల్పించినం’ అని రేవంత్ సర్కార్ మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన నిజం. వ్యవసాయ మార్కెట్ కేంద్రాలు, ఐకేపీ సెంటర్ల పరిసరాలను పరిశీలిస్తే కండ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. యాసంగి పంట కొనుగోలుపై రేవంత్ సర్కార్‌కు అసలు ముందస్తు ప్రణాళికే లేదని తేలిపోయింది.
వరంగల్, మహబూబాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, నల్లగొండ సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని రైతులు అరిగోస పడుతున్నరు. కొనుగోలు కేంద్రాల వద్ద అరకొరా కొనుగోలు చేసిన వడ్లను సైతం హమాలీలు లేక, మిల్లులకు తరలించే వాహనాలు లేక వడ్ల రాశులు ఎక్కడికక్కడే ఉన్నాయి.
తాటిపత్రిలు కిరాయికి తెచ్చుకొని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు రూ.400 కిరాయి అవుతుందని, అలా 20 రోజులు కవర్లకు కిరాయికి కడుతూనే ఉన్నానని నెక్కొండకు చెందిన ఓ రైతు తన గోడు వెల్లబోసుకొన్నాడు. పంట పండేందుకు ఎన్ని రోజులు పట్టిందో.. ఆ పండిన పంటను అమ్ముకోవడానికి అన్ని రోజులు పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
యాసంగి పంట ఎప్పుడు వస్తుంది? వచ్చిన పంటను ఎట్లా కొనుగోలు చేయాలి? అనే కనీస ముందస్తు ప్రణాళికలు ప్రభుత్వం వద్ద లేకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో రైతులు తమ పంటను అమ్మడం కోసం అరిగోసపడుతున్నారు. ఇప్పటికీ 10 జిల్లాల్లో కనీసం 30శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు.
మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాటికి 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని ఆయా జిల్లాల్లో అధికారులు ఇచ్చిన లెక్కలే తేల్చిచెప్తున్నాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి నల్లగొండ అధికారులు చెప్తున్న లెక్కకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపిస్తున్నదని తేలింది.
ప్రభుత్వ కొనుగోలుకు, రైతు అమ్మకానికి మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉన్నదని తెలిసింది. ఈ జిల్లాలో 80శాతం కొనుగోలు పూర్తయిందని అధికారులు చెప్తున్నారు. అంటే దాదాపు పూర్తయినట్టే కదా! అని ఆరా తీస్తే ‘పైనుంచి చెప్పినట్టే చెప్తున్నాం. అంతకన్నా మమ్మల్ని ఏమీ అడుగొద్దు’ అంటూ అధికారులు తమ నిస్సహాయతను వ్యక్తంచేయడం గమనార్హం.