మద్దూరు (ధూళిమిట్ట), మే 22: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు ధాన్యం బస్తాలు మీద పడడంతో గాయపడిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మద్దూరు పీఏసీఎస్ క్యాష్ కౌంటర్ ఎదుట హమాలీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ.. లద్నూర్ కొనుగోలు కేంద్రంలో ఈనెల 10న రాత్రి చీకట్లో ధాన్యం బస్తాలు లారీలో లోడ్ చేస్తుండగా బస్తాలు హమాలీలపై పడడంతో ముగ్గురు గాయపడ్డారని తెలిపారు.
ఇందులో హమాలీ ఉడుత సిద్దిమల్లు కాలు, వేళ్లు విరిగాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద వసతులు కల్పించకపోవడతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గాయపడిన హమాలీని ఆదుకోవాలని, లేనిపక్షంలో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ధర్నాను విరమించేందుకు స్థానిక ఎస్సై మహ్మద్ ఆసిఫ్ ప్రయత్నించినా వారు వినలేదు. చేర్యాల సీఐ రమేశ్ మద్దూరుకు చేరుకొని హమాలీలు, సొసైటీ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, సీఈవో బోయిని శ్రీధర్తో ప్రత్యేకంగా మాట్లాడి న్యాయం చేయిస్తానని హామీ ఇవ్వడంతో హమాలీలు ధర్నా విరమించారు. ధర్నాలో సీపీఎం మండల కార్యదర్శి షఫీ, నాయకులు అల్ధ రమేశ్, ఎల్లస్వామి, మల్లారెడ్డి, కనకయ్య, నరేశ్ పాల్గొన్నారు.