హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జొన్న రైతులతో దొంగాట ఆడుతున్నదనే విమర్శలొస్తున్నాయి. జొన్నల కొనుగోలు కోసం రైతులు మండుటెండల్లో పడిగాపులు కాస్తుంటే, సర్కార్ మోసపూరిత వైఖరి అవలంబిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు, కొనుగోలు చేస్తామని ప్రకటిస్తూనే, మరోవైపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మక్కజొన్నతోపాటు జొన్న పంటను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, జొన్నల కొనుగోళ్లు కూడా ప్రారంభిస్తామని ఈ నెల 5వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు జొన్నల కొనుగోలు ప్రారంభంకాకపోవడం గమనార్హం. ఈ నెల 4వ తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలో జొన్నల కొనుగోలుపై చర్చించారు. ఈ సందర్భంగా జొన్నల కొనుగోళ్లపై ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్‌కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ మరుసటి రోజు భేటీ అయిన సబ్‌కమిటీ.. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మిగిలిన జిల్లాల్లో జొన్నల కొనుగోళ్లపై అనుమతిని పెండింగ్‌లో పెట్టింది. తదుపరి క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని వాయిదా వేసినట్టు తెలిసింది.
జొన్నల కొనుగోలుకు ఒకే జిల్లాకు అనుమతి ఇచ్చి మిగిలిన జిల్లాలకు నిరాకరించడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం రాష్ట్రం మొత్తం జొన్నల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చినట్టు ఇటీవల ప్రకటించింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే రెండు రోజులపాటు కేంద్రాలు ప్రారంభించి జొన్నలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత జొన్నల కొనుగోలు నిలిపివేస్తున్నట్టు జిల్లా అధికారులు ప్రకటించారని తెలిసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎక్కడా జొన్నల కొనుగోళ్లు ప్రారంభంకాలేదు. దీంతో జొన్నల కొనుగోళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న పలుగ్రామాల రైతుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందనే పలుచోట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు నెలన్నరగా రైతులు జొన్నల కొనుగోళ్ల కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగు కాగా సుమారు 9 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా. సర్కార్ కొనుగోళ్లు చేపట్టకపోతే బహిరంగ మార్కెట్లో అమ్ముకుందామనుకుంటే రైతులకు మద్దతు ధర దక్కడంలేదు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,699 ఉండగా మార్కెట్లో రూ.2వేల లోపే ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు మద్దతు ధర కోసం సర్కార్ వైపు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జొన్నల కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
ఆదిలాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : జొన్నలను కొనాలంటూ రైతులు బుధవారం ఆదిలాబాద్ మార్కెట్‌యార్డు ఎదుట ధర్నా చేశారు. జొన్నల కొనుగోలుకేంద్రంలో రెండు రోజులు కొని, నాలుగు రోజులుగా నిలిపివేశారు. రైతులు తీసుకువస్తున్న జొన్నల వాహనాలను మార్కెట్‌యార్డులోకి సిబ్బంది అనుమతించడం లేదు. బుధవారం కూడా వివిధ గ్రామాల నుంచి రైతులు జొన్న పంటను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. గేటు వేసి ఉండడంతో వాహనాలను లోనికి అనుమతించాలని అధికారులను కోరినా వారు కనికరించలేదు. దీంతో రైతులు మార్కెట్‌యార్డు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డిని రైతులు నిలదీశారు. శనగ పంట కొనుగోళ్లలో ముందుగా షెడ్యూల్ ప్రకటించి మధ్యలోనే ఆపివేశారని, జొన్న పంటను పూర్తిగా కొనుగోలు చేస్తారనే గ్యారెంటీ ఏముందని రైతులు మార్కెట్ కమిటీ చైర్మన్‌ను ప్రశ్నించారు. ఆరు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు తక్షణం స్పందించి పశువుల మార్కెట్లోకి వాహనాలను అనుమతించడంతో అక్కడి రైతులు శాంతించారు.