న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని 2027, మే వరకూ పొడిగించారు. నిజానికి ప్రవీణ్ సూద్ పదవీకాలం 2026 మే 24తో ముగియనుంది. ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ఈ పొడిగిపును క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించింది.
1986 బ్యాచ్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ ఇప్పడు మరో ఏడాది పాటు ఈ దర్యాప్తు సంస్థకు అధిపతిగా కొనసాగుతారు. ఈ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ నేతృత్వలోని ఉన్నతస్థాయి ఎంపిక ప్యానల్ సమావేశంలో రాహుల్ గాంధీ రెండు పేజీల అసమ్మతి నోట్‌ను సమర్పించిన మరుసటి రోజే ఈ తాజా పొడిగింపు నిర్ణయం వెలువడటం గమనార్హం.