Urea Shortage | గద్వాల, ఖానాపూరం, తొర్రూర్, గంభీరావుపేట: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రోజుల తరబడి వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ తిరిగినప్పటికీ యూరియా దొరక్కపోవడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేస్తూ నిరసనలు తెలిపారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు నల్లబెల్లి మండలం మేడిపల్లి సొసైటీలో యూరియా కోసం ఉదయం 5 గంటల నుంచే రైతులు పడిగాపులు కాశారు. బస్తాల పంపిణీ సమయంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఓ రైతు స్వల్పంగా గాయపడ్డాడు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం బుధరావుపేట రైతు వేదిక వద్ద యూరియా కోసం రాస్తారోకో చేపట్టిన రైతులకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్ సర్కారు చేతగానితనమే కారణమని ఆయన విమర్శించారు.
ధర్నాలో పాల్గొన్న మాలోతు కవితతో చర్చలు జరుపుతున్న పోలీసులు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో రైతుల ధర్నాకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత మద్దతిచ్చారు. ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు.
దంతాలపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ధర్నా
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో యూరియా దొరకడం లేదంటూ రైతులు రోడ్డు ఎక్కారు. గత 20 రోజులుగా యూరియా కోసం తెల్లవారుజామునే మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం వద్ద పడి కాపులు కాస్తున్న కూడా ఒక్క బస్తా దొరికే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు చూడలేదని రైతులు అంటున్నారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తుందని వారు ప్రశ్నించారు. తక్షణమే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి.. రైతులకు కావాల్సిన యూరియా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై రైతులు ధర్నా
గద్వాల జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ నేత బాస్ హనుమంతు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బాస్ హనుమంతు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరువులకు కొరత లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాగా, ధర్నా దగ్గరకు వచ్చిన పోలీసులు.. వారికి నచ్చజెప్పారు. దీంతో రైతులు ధర్నా విరమించి వెళ్లిపోయారు.
గంభీరావుపేట మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో
సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్‌కు వచ్చిన యూరియా లోడ్‌లో 240 బస్తాలు మాత్రమే సరిపోవని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం లోడ్‌ను బొప్పాపూర్లోనే దించాలని డిమాండ్ చేశారు. ఈ క్రంమలో రంగప్రవేశం చేసిన పోలీసులు మిగిలిన లోడ్‌ను గంభీరావుపేట మండల కేంద్రానికి తరలించారు. ఇదిలా ఉంటే యూరియా కోసం గంభీరావుపేట మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు.