శంకరపట్నం, ఫిబ్రవరి 12 : ‘యూరియా బుకింగ్ యాప్‌తో ఆగమవుతున్నాం.. పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వండి’ అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో జాతీయ రహదారిపై రైతులు రా స్తారోకోకు దిగారు. తాడికల్ సింగిల్ విండో గోదాంకు బుధవారం సాయంత్రం 230 యూరియా బస్తాలు సరఫరా అయినట్టు రైతులు తెలుసుకుని గురువారం ఉదయం తాడికల్ సింగిల్‌విండో గోదాముకు తరలివెళ్లారు.
అప్పటికే యూరియా స్టాక్ అయిపోయినట్టు యాప్‌లో కనిపించడంతో రైతులు అసహనానికి గురయ్యారు. యూరియా బస్తాలు క్షణాల్లో అయిపోవడంపై కన్నెర్ర జేశారు. యూరియాలోటు, యాప్ బుకింగ్ సిస్టమ్‌తో విసిగిపోయిన రైతులు గోదాం నుంచి నేరుగా జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకోకు దిగారు. యాప్ విధానంతో చదువురాని, ఆండ్రాయిడ్ ఫోన్లు లేని, ఆపరేటింగ్ రాని రైతులు అరిగోస పడుతున్నారని పేర్కొన్నారు. వరి పైర్లు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా అందక పంట దిగుబడి కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం కొత్తగా తెచ్చిన యాప్ విధానంతో ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. దీనిని తొలగించి రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉంచి, పాత పద్ధతిలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ రైతులకు సంఘీభావంగా కార్యకర్తలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. రోడ్డుకిరువైపులా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.