పరిగి, ఆగస్టు 20 : కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూసేకరణలో ఎకరాకు ఎంత పరిహారం చెల్లిస్తారో తేల్చాకే సర్వే చేపట్టాలంటూ రైతు లు అధికారులను అడ్డుకున్నారు. గురువారం మండలంలోని సయ్యద్పల్లి శివారులో తహసీల్దార్ వెంకటేశ్వరితోపాటు అధికారులు సర్వే చేసేందుకు పోలీస్ బందోబస్తుతో వెళ్లా రు. అక్కడ రైతులు తమ భూములు సారవంతమైనవని, ఎకరానికి ఎంత పరిహారం ఇస్తారో తేల్చకుండా సర్వే ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. గ్రామసభ నిర్వహించి ఎకరాకు ఎంత పరిహారం అందజేస్తారన్నది ఉన్నతాధికారులు తేల్చాలన్నారు. ప్రభుత్వ విలువ ఎకరాకు రూ.8.40 లక్షలు ఉందని, తమకు పది రెట్లు ఎక్కువగా ఎకరాకు రూ.80 లక్షలు పరిహారంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
అప్పటివరకు సర్వే చేయొద్దని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తాను ఏమి చేయలేనని, ఉన్నతాధికారులకు వివరిస్తానని తహసీల్దార్ తెలిపా రు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కోసం తమ గ్రామానికి చెందిన వెయ్యి ఎకరాలు భూమి పోతుందని.. లక్ష్మీదేవిపల్లి నుంచి ఒక్క ఎకరా భూ మి కూడా పోవడం లేదని అలాంటప్పుడు ఆ ప్రాజెక్టుకు లక్ష్మీదేవిపల్లి పేరు ఎందుకు పెడతారని రైతులు ప్రశ్నించారు. అధిక మొత్తంలో భూములు కోల్పోతున్న తమ గ్రామం పేరు ప్రాజెక్టుకు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని భూములకు ఆమోదయోగ్యమైన ధర నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల అడ్డగింతతో అధికారులు సర్వే చేయకుండా వెనుదిరిగారు.