Kajipet : కాజీపేట వైఎస్సార్ నగర్లో 30 ఏళ్లుగా జీవిస్తున్న వారికి ఇంటి పట్టాలు కేటాయించి, ప్రభుత్వమే ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను కలిసి వైఎస్సార్ కాలనీ ప్రజల సమస్యను త్వరితగతిన పరిష్కారించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనతో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కూడా ఉన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ కాలనీ ప్రజలకు అండగా నిలుస్తూ ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు అందించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదలను కొట్టి పెద్దలకు పెట్టే సంప్రదాయం కొనసాగుతోందని అన్నారు. గత 30 ఏళ్లుగా స్థానికంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయమంటున్నారని, కమిషన్లకు కక్కుర్తి పడి ఆ స్థలాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తున్నారని అన్నారు. వైయస్సార్ నగర్ కాలనీలో నివసిస్తున్న దాదాపు 100 కుటుంబాలకు ఇంటి నెంబర్లు, కరెంటు బిల్లులు ఉన్నాయని చెప్పారు.
వైఎస్సార్ నగర్ నగరం నడి బొడ్డున ఉందని కాలనీపై కాంగ్రెస్ కన్ను పడిందని మధుసూదనాచారి విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో స్థానిక కాంగ్రెస్ నాయకులు కాలనీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఖాళీ చేయకుంటే బుల్డోజర్లతో కుల్చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ నగర్ కాలనీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, గర్భవతులు ఉన్నారని, కాంగ్రెస్ దుండగులు చేస్తున్న అరాచకాలకు వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం వెంటనే స్థానికంగా నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు కేటాయించి, ప్రభుత్వమే సొంత ఖర్చులతో గృహ నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూం ఇప్పిస్తాం అని మాయా మాటలు చెప్పి వారి బ్రతుకులు బజార్ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ నగర్ కాలనీ ప్రజల సమస్యలు పరిష్కరించి, న్యాయం చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.